సమున్నతంగా, సగర్వంగా.. తెలంగాణలో వజ్రోత్సవాల ఏర్పాట్లు..

9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

Advertisement
Update:2022-08-03 08:48 IST

స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజ‌లందరిలో నిండేలా, సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవ కమిటీతో ఆయన భేటీ అయ్యారు.

కోటీ 20లక్షల జెండాలు..

విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువత.. యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు కేసీఆర్. రాష్ట్రంలోని మొత్తం 1.2 కోట్ల ఇళ్లకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని చెప్పారు. 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

8 నుంచి 22 వరకు..

'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం' పేరుతో ఆగస్ట్ 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. 8వతేదీన హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. పోలీస్ బ్యాండ్ తో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతు బంధుసమితి అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాఖాధిపతులు.. అందరూ హాజరవుతారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన కమాండర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2వేలమంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా.

రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక అలంకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. ప్రభుత్వ, ప్రైవేట్.. స్కూల్స్ కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, దేశభక్తి గీతాల పోటీలు పెట్టాలి. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించాలి. రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించిన గాంధీ సినిమాని రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో ప్రదర్శించాలి. ఫ్రీడమ్ కప్ పేరుతో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించాలి. ర్యాలీలు, వివిధ సెంటర్లలో సామూహిక గీతాలాపన, కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ జరపాలి. వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటాలి. ఫ్రీడమ్ 2కె రన్ నిర్వహించాలి. రక్తదాన శిబిరాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ చేయాలి. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తామన్నారు కేసీఆర్. అదే విధంగా పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని చోట్ల సమావేశాలు జరగాలని సూచించారు. ఈమేరకు అధికారులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

Tags:    
Advertisement

Similar News