95నుంచి 105 మన టార్గెట్.. హుస్నాబాద్ సభలో కేసీఆర్

60 ఏళ్లు రాజ్యం వెలగబెట్టినవారు దళిత బిడ్డల గురించి ఆలోచన చేయలేదని, చేస్తే.. అప్పుడే దళితబంధు ఇచ్చేవారని చెప్పారు సీఎం కేసీఆర్.

Advertisement
Update:2023-10-15 17:40 IST

95 నుంచి 105 మన టార్గెట్.. హుస్నాబాద్ సభలో కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 95నుంచి 105 స్థానాలు గెలవాలని, ఆ లక్ష్యంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ సభలో ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను మరోసారి వివరించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కి సభలోనే బీఫామ్ అందజేశారు. ఆయన్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.


2018 ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. ఈసారి కూడా ఇక్కడినుంచి తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో మేనిఫెస్టో ప్రకటించి, కొంతమంది అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన ఆయన.. వెంటనే హెలికాప్టర్లో హుస్నాబాద్ చేరుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వస్తున్నవారి మాటలు విని ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికలు వస్తుంటాయ్, పోతుంటాయ్.. అని ఎవరు తమకు మంచి పాలన ఇవ్వగలరో ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని చెప్పారు. రౌతు ఎవరో, రత్నం ఎవరో గుర్తించాలన్నారు. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దని, మన తలరాతలు, మన తాలూకా రాతలు మార్చేవారికే ఓటు వేయాలని సూచించారు.

60 ఏళ్లు రాజ్యం వెలగబెట్టినవారు దళిత బిడ్డల గురించి ఆలోచన చేయలేదని, చేస్తే.. అప్పుడే దళితబంధు ఇచ్చేవారని చెప్పారు సీఎం కేసీఆర్. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా దళితులు పేదరికంలో మగ్గుతున్నరంటే దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 60, 70 ఏళ్ల క్రితం దళితబంధు లాంటి పథకం ప్రారంభించి ఉంటే.. ఈరోజు దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదని ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణ పరిస్థితి ఏంది? ఏవిధంగా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉంది అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. నాడు సాగునీరు, తాగునీటికి కటకటగా ఉండేదని ఇప్పుడు తాగునీరు అందని గ్రామం ఏదీ లేదన్నారు. ఎన్నికలకోసం తాను పెన్షన్లు పెంచలేదని.. విధి వంచితులను ఆదుకునే క్రమంలో ప్రతి ఏడాదీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News