బాన్సువాడ కాదు.. బంగారువాడ
పోచారం శ్రీనివాసరెడ్డికి మళ్లీ పెద్ద స్థానం, ఉన్నత స్థానం కల్పిస్తామని అన్నారు సీఎం కేసీఆర్. కచ్చితంగా ఆయనకు పెద్ద హోదా వస్తుందని అది గ్యారెంటీ అని అన్నారు.
బాన్సువాడను బంగారువాడగా మార్చారంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు సీఎం కేసీఆర్. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాబట్టే.. బాన్సువాడ బంగారువాడలా తయారైందన్నారు. గత ప్రభుత్వంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మి తాండవించేదని చెప్పారు కేసీఆర్. ఏ పని మొదలుపెట్టినా బ్రహ్మాండంగా పూర్తయ్యేదని గుర్తు చేశారు.
రైతుబంధు, ఎరువులు తేవడం, ఢిల్లీలో వారం రోజులు కూర్చొని కొట్లాడి రాష్ట్రానికి ఎరువులు తెచ్చేవారని పోచారం గురించి చెప్పారు సీఎం కేసీఆర్. స్పీకర్ పదవిలో ఉన్నానని ఆయన ఎప్పుడూ రుబాబు చేయలేదని కార్యకర్తలాగే మసలుకుంటారని చెప్పారు. తిరిగిన కాలు, చేసే చెయ్యి ఎప్పటికీ ఊరుకోవని.. ఆయన ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారని అన్నారు. తన నియోజకవర్గంలో కూడా 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని, కానీ బాన్సువాడకు పోచారం తెచ్చుకోగలిగారని అన్నారు సీఎం కేసీఆర్.
రిజల్ట్ తేలిపోయింది..
బాన్సువాడ నియోజకవర్గం రిజల్ట్ ముందే తెలిసిపోయిందన్నారు సీఎం కేసీఆర్. ఈ సభను చూస్తే ఆయన మెజార్టీ లక్ష గ్యారెంటీ అని తేలిపోయిందన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, వర్గాలు కలసి బతుకుతున్నామని.. కొంతమంది దుర్మార్గులు వచ్చి కుటిల ప్రయత్నాలు చేశారని, అలాంటి వాటిని ప్రజలు తిప్పి కొట్టారన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాజ్యంగానే ఉంటుందన్నారు.
పెద్ద హోదా..
పోచారం శ్రీనివాసరెడ్డికి మళ్లీ పెద్ద స్థానం, ఉన్నత స్థానం కల్పిస్తామని అన్నారు సీఎం కేసీఆర్. కచ్చితంగా ఆయనకు పెద్ద హోదా వస్తుందని అది గ్యారెంటీ అని అన్నారు.
♦