బీఆర్ఎస్‌కు రంజిత్ రెడ్డి గుడ్‌బై.. కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థిగా పోటీ?
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ అవకాశాన్ని ఎంచుకుంటున్నట్లు ప్రకటించారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ అవకాశాన్ని ఎంచుకుంటున్నట్లు ప్రకటించారు.
రంజిత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. మొదట పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ.. స్థానిక సర్వేల్లో ఆమెకు ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రత్యామ్నాయం వైపు కాంగ్రెస్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డితో ఆ పార్టీకి చెందిన నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తానన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రంజిత్ రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేశారు. దీంతో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు అవకాశమిచ్చింది బీఆర్ఎస్. బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు.