కేంద్ర సర్వీస్ అధికారులు సొంత అభిప్రాయాలు వెల్లడించవచ్చా? చర్చనీయాంశంగా స్మిత సబర్వాల్ ట్వీట్

స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ కేడర్‌లో ఉంటూ ఇలా విమర్శలు చేయడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం అని చెబుతోంది. అదే సమయంలో ఐఏఎస్/ఐపీఎస్ అసోసియేషన్ కూడా స్మిత వ్యాఖ్యలపై రెండుగా విడిపోయినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2022-08-20 17:14 IST

దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరంలో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, సామాన్యులతో పాటు బ్యూరోక్రాట్లు కూడా స్పందిస్తున్నారు. కేంద్రతో పాటు గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సమయంలో ఒక తీవ్రమైన సంఘటనలో శిక్ష పడిన వారిని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడంపై వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఎంతో మంది సోషల్ మీడియాలో నిరసన తెలిపారు.

బిల్కిస్ బానో కేసు నేరస్థులను విడుదల చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా తమ నిరసనను వెల్లడించారు. ఇదే క్రమంలో సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పారు. 'ఓ మహిళగా, ప్రభుత్వ అధికారిణిగా బిల్కిస్‌ బానో కేసు వార్తలను నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న బిల్కిస్‌ బానో హక్కులను తుడిచిపెట్టి, మనలను మనం స్వేచ్ఛాయుత దేశంగా పిలుచుకోలేము' అని స్మిత ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

స్మిత సబర్వాల్ తెలంగాణలో చాలా పాపులర్ ఆఫీసర్. ఆమె తెలంగాణ రాక ముందు ఉమ్మడి ఏపీలో కలెక్టర్‌గా పని చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంవోలో కార్యదర్శిగా ఉండటంతో ఆమె ట్వట్‌పై చర్చ జరుగుతోంది. 1964లో రూపొందించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం .. కేంద్ర సర్వీసులో ఉండే ఉద్యోగులు తమ సొంత అభిప్రాయాలను పబ్లిక్ డొమైన్లలో వెల్లడించకూడదు. అంటే.. ఏ ఘటన మీద అయినా ఐఏఎస్/ఐపీఎస్‌లు బయట మీడియాతో మాట్లాడకూడదు. అదే సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. కానీ స్మిత సబర్వాల్ ఒక కేంద్ర సర్వీస్ ఎంప్లాయ్‌గా ఉంటూ. వేరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ కేడర్‌లో ఉంటూ ఇలా విమర్శలు చేయడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం అని చెబుతోంది. అదే సమయంలో ఐఏఎస్/ఐపీఎస్ అసోసియేషన్ కూడా స్మిత వ్యాఖ్యలపై రెండుగా విడిపోయినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఐఏఎస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బీపీ ఆచార్య కూడా స్పందించారు.

స్మిత సబర్వాల్ తప్పు లేదు..

బిల్కిస్ బానో వ్యవహారంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ స్పందించడంలో ఏ మాత్రం తప్పు లేదని బీపీ ఆచార్య అన్నారు. ఆమె ఒక మహిళగానే స్పందించి తప్ప.. ఎక్కడా ప్రభుత్వంలో భాగమైన బ్యూరోక్రాట్‌గా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. ఆమె బహిరంగంగా, ప్రభుత్వ ప్రచార సాధనాలను ఉపయోగించుకొని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. కేవలం తన సొంత సామాజిక మాధ్యమ అకౌంట్ నుంచి తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించిందని ఆచార్య అన్నారు.

ఒక మహిళగా తన అభిప్రాయాలు తాను చెప్పింది తప్ప.. ప్రభుత్వ అధికారిగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని గుర్తుంచుకోవాలని ఆచార్య అన్నారు. మనం కూడా ఆమె మాటల్లోని ఆవేదన అర్థం చేసుకోవాలి కానీ.. ఇలా వివాదాస్పదం చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. అయితే, కొన్ని సార్లు రాజకీయపరమైన కేసులను పట్టించుకోక పోవడమే మంచిదని ఆయన సూచించారు.

ఇక తెలంగాణ మాజీ కార్యదర్శి ఒకరు స్పందిస్తూ.. స్మిత సబర్వాల్ ఈ విషయంలో లక్ష్మణ రేఖ దాటిందని అన్నారు. కాండక్ట్ రూల్స్ అనేవి అన్ని విషయాల్లో అమలు అవుతాయని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఏదేమైనా.. సివిల్ సర్వెంట్స్‌కు తమ సొంత అభిప్రాయాలు వెలువరిచే అవకాశం లేకపోవడంపై చర్చ జరగాల్సి ఉందని మాజీ ఐఏఎస్‌లు కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News