కొత్త డీజీపీకి కేటీఆర్ కీలక సూచన
వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు సురేష్ బాబును పోలీసులు వేధించారని, చిత్తహింసలు పెట్టారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. విమర్శించడం నేరమా అంటూ డీజీపీని ప్రశ్నించారు కేటీఆర్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలను చూసి కలత చెందానన్నారు. తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలో మాలోతు సురేష్ బాబు అనే గిరిజన యువకుడిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టారని, దానికి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేశారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్సనల్ అసిస్టెంట్‌ను విమర్శిస్తూ వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు సురేష్ బాబును పోలీసులు వేధించారని, చిత్తహింసలు పెట్టారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. విమర్శించడం నేరమా అంటూ డీజీపీని ప్రశ్నించారు కేటీఆర్. సోషల్‌మీడియాలో పోస్టులపై ఫిర్యాదు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయన్నారు కేటీఆర్.
గతంలో తెలంగాణ పోలీసులు అంటే ప్రొఫెషనలీజంకు మారుపేరుగా ఉండేవారని, ఆ పేరు పోకుండా కాపాడుకోవాలని డీజీపీకి సూచించారు కేటీఆర్. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులను అదుపు చేయాలన్నారు. ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు.