వడ్డీతో సహా చెల్లిస్తాం.. రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్
నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని సర్వే నంబర్ 1లో నిర్మాణాలను కూల్చివేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అమ్మి, కాంగ్రెస్ ప్రభుత్వమే క్రమబద్దీకరించిన ప్లాట్లలో ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి కూలగొట్టించారో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించడమేంటని ప్రశ్నించారు. సీఎంకు అన్నగా ప్రచారం చేసుకుంటూ మేడ్చల్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు. నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ నాయకులు రాందాస్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబమే అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మారన్నారు కేటీఆర్. ఆ ప్లాట్లను 2008లో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్రమబద్ధీకరించిందన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా NOCగా కూడా జారీ చేశారని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. కానీ, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను కూలగొట్టించాడని ఫైర్ అయ్యారు.
ప్రజలపై కక్షగట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు ముగింపు పలకడం ఖాయమన్నారు కేటీఆర్. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఇలా వేధించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇఛ్చారు.