పేట్లబురుజు ఆసుపత్రికి రూ.50 లక్షల నిధులు మంజూరు... కారణం చెప్పిన ఎంపీ సంతోశ్ కుమార్
తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని డాక్టర్ పి. మాలతికి ఇచ్చారు.
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ రావు హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న పేట్లబురుజు ఆసుపత్రికి రూ.50 లక్షల మంజూరీ పత్రాన్ని అందజేశారు. గతంలోనే ఆయన ఆసుపత్రి అభివృద్ధికి రూ.1 కోటి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి తొలి విడతగా రూ.50 లక్షల మంజూరీ పత్రంతో పాటు, చెక్కును ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతికి అందజేశారు. తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని డాక్టర్ పి. మాలతికి ఇచ్చారు.
ప్రస్తుతం ఇచ్చిన మంజూరీ పత్రానికి సంబంధించిన నిధులు ఏప్రిల్ నెలలో విడుదల అవుతాయని సంతోశ్ కుమార్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నిధుల నుంచే ఆసుపత్రికి ఫండ్స్ కేటాయించానని... భవిష్యత్‌లో మిగిలిన రూ.50 లక్షలు కూడా అందిస్తానని ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రి అభివృద్ధికి తనతో పాటు తన మిత్రులు కూడా సహరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పేట్లబురుజు ఆసుపత్రికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోశ్ చెప్పారు. ఈ ఆసుపత్రిలోనే తాను పుట్టానని.. అందుకే ఆ దవాఖాన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ తాను పుట్టిన ఆసుపత్రికి నిధులకు కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. తాను జన్మించిన ఆసుపత్రి పట్ల ఆయన ప్రేమ చూపించినట్లే.. మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా తాము పుట్టిన ఆసుపత్రులు, చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయలో సంతోశ్ కుమార్ ఒక మార్గదర్శిగా నిలిచారని చెప్పారు.
ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బంధువే కాకుండా అత్యంత సన్నిహితుడు అనే విషయం తెలిసిందే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని ఎంతో మంది అభినందిస్తున్నారు. ప్రజల్లో పచ్చదనం పెంపొందించడంపై ఆయన ఎంతో కాలంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకొని చెట్లను పెంచుతున్నారు. అంతే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విస్తృతమైన ప్రచారం తీసుకొని రావడానికి ఎంతో మంది సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయడంలో ఆయన సఫలం అయ్యారు.
ప్లేట్లబురుజు ఆసుపత్రి హైదరాబాద్‌లోనే అత్యధిక కాన్పులు జరిగే సర్కారు దవాఖానగా పేరుగాంచింది. ఇటీవలే మంత్రి హరీశ్ రావు ఈ ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని కూడా చెప్పారు. తాజాగా.. ఎంపీ సంతోశ్ రావు నిధులు కేటాయించడంలో కూడా మంత్రి హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు.