దసరాకు బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్!
ప్రతీ ప్రకటనకు ఒక శుభ ముహూర్తాన్ని చూసుకునే సీఎం కేసీఆర్.. దసరా పర్వదినం నాడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో సంచలనం సృష్టించాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల కళ్లు తిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు మేనిఫెస్టో విషయంలో ప్రజలకు లీకులు ఇచ్చారు. త్వరలోనే మరిన్ని శుభవార్తలు వింటారని, ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.
ప్రతీ ప్రకటనకు ఒక శుభ ముహూర్తాన్ని చూసుకునే సీఎం కేసీఆర్.. దసరా పర్వదినం నాడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా గత దసరా రోజు పేరు మార్చిన కేసీఆర్.. ఇప్పుడు మేనిఫెస్టోతో అందరినీ ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కోసం పలువురు సీనియర్లు ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న కొన్ని పథకాలను అధ్యయనం కూడా చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో కొన్ని పథకాలు ప్రకటించింది. బీఆర్ఎస్ వాటికి మించి మేనిఫెస్టోలో హామీలను ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. రైతులకు ఉచితంగా ఎరువులు, నిరుద్యోగ భృతి, ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ల పెంపుతో పాటు మరిన్ని పథకాలను మేనిఫెస్టోలో చేర్చనున్నారు.
ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను మరిన్ని ప్రయోజనాలతో మెరుగు పరచడమే కాకుండా.. కొత్త పథకాలను కూడా మేనిఫెస్టోలో చేర్చున్నారు. గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి ఎలాంటి కమిటీ వేయకపోయినా.. ఎస్. మధుసూదనాచారితో సహా సీనియర్ల సహకారంతో కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.
డీఎంకే ప్రభుత్వం తమిళనాడులో ఇచ్చిన వాగ్దానాలు, అమలు తీరును ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. ఇక కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రైతు బంధు తరహాలోనే రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా యూరియా, డీఏపీ, ఎన్‌పీకేలను పంపిణీ చేయాలనే హామీని పరిశీలిస్తున్నారు. అలాగే వ్యవసాయ రుణాలపై రూ.1 లక్ష వరకు రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉన్నది.
అన్ని రకాల ఆసరా పెన్షన్‌లను రూ.1000 చొప్పున పెంచే అవకాశం ఉన్నది. గతంలో ఇవ్వని హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నాది. అయితే నిరుద్యోగ భృతిని గతంలో ప్రకటించినా అమలు చేయడం లేదు. ఈ సారి కచ్చితంగా ఈ హామీ అమలు అయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే హామీపై కూడా కసరత్తు చేస్తున్నారు.
దసరా రోజు విడుదల చేసే మేనిఫెస్టోతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని.. ఇతర పార్టీలు ఆ హామీలను చూసి దిమ్మతిరిగిపోతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ మేనిఫెస్టోతో మరోసారి సంచలనం సృష్టిస్తారనే చర్చ జరుగుతున్నది.