కాంగ్రెస్ హయాంలో ఇంత అరాచకమా..? భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు

ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Advertisement
Update:2024-01-17 11:34 IST

హైదరాబాద్‌ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసమైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తెలంగాణవాదులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడు మహావీర్‌ కాలనీకి చెందిన గోవింద్‌ అనే వ్యక్తి. మద్యం మత్తులో ఆల్విన్‌ కాలనీ చౌరస్తాకు వచ్చి అక్కడ ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని కింద పడేశాడు, ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు గోవింద్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానో గౌరవించే జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు కేటీఆర్.


ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం కాలేదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకానీ, కేసీఆర్‌ ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు శ్రవణ్. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని మండిపడ్డారు.

ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అదే ప్రాంతంలో మళ్లీ ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News