తెలంగాణలో ఇంటి వద్దకే బూస్టర్.. నెలరోజులు టార్గెట్..

బూస్టర్ డోస్ పంపిణీకి నెలరోజుల టార్గెట్ ఫిక్స్ చేసారు మంత్రి హరీష్ రావు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ నెలరోజుల్లోగా బూస్టర్ ఇవ్వాలని చెప్పారు.

Advertisement
Update:2022-07-26 07:58 IST

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత బూస్టర్ డోస్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ విషయంలో క్యూలైన్లు కనిపించాయి కానీ, ఇప్పుడు పిలిచి బూస్టర్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో బూస్టర్ తీసుకున్నవారి శాతం మరీ తక్కువగా ఉందని అంటున్నారు అధికారులు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బూస్టర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇంటి వద్దకే వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్ రావు.

నెలరోజులే టార్గెట్..

టీకా లభ్యత సమృద్ధిగానే ఉంది, కానీ బూస్టర్ విషయంలో ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కరోనా పోయినట్టేనని భావిస్తున్నారు. కానీ అలాంటి అపోహలు పెట్టుకోవద్దని, బూస్టర్ తీసుకుంటే కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టే అవకాశముందని అంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 2కోట్లకు పైగా బూస్టర్ డోస్ లు వేయాల్సి ఉంది. రెండో డోస్‌ వేసుకొని 6 నెలలు దాటినవారిలో ఇమ్యూనిటీ కారకాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, అందుకే అలాంటివారంతా వెంటనే ప్రికాషన్‌ డోస్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బూస్టర్ డోస్ పంపిణీకి నెలరోజుల టార్గెట్ ఫిక్స్ చేసారు మంత్రి హరీష్ రావు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ నెలరోజుల్లోగా బూస్టర్ ఇవ్వాలని చెప్పారు.

సీజనల్ వ్యాధులపైనా సమీక్ష..

భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలంతా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని, అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మలేరియా, డెంగీ, టెస్టింగ్‌ కిట్లతోపాటు కొవిడ్‌ పరీక్షల కోసం ర్యాపిడ్‌ కిట్లను, జిల్లా ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయని, ఆయనకు ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News