వ్యవసాయ రంగానికి ఊతం.. తెలంగాణలో పెట్టుబడులకు ఏడీఎం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో తమ కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి విక్రమ్ లూథర్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
పుష్కలమైన నీళ్లు, 24 గంటల విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, రైతు బంధు తదితర కార్యక్రమాల వల్ల ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఇప్పుడు దేశానికే అన్నం పెట్టేలా భారీగా పంటలు పండిస్తోంది. కాగా, వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా.. రైతులకు మరింత లాభం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రాసెసింగ్ కంపెనీ ఆర్చర్ డేవియర్స్ మిడ్‌ల్యాండ్ (ఏడీఎం) తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో ఏడీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విక్రమ్ లూథర్‌తో సమావేశం అయ్యారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి.. తద్వారా ఆర్థిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులను ఏడీఎం ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ బృందం వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లు, ఆర్అండ్‌డీ ఏర్పాటు, ఇతర అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏడీఎంను ఆహ్వానించారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి విక్రమ్ లూథర్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
కారెలోన్ విస్తరణ ప్రణాళిక..
అట్లాంటాలోని హెల్త్ టెక్ కంపెనీ కారెలోన్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజత్‌పురితో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగ ప్రగతి, ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ అనుకూల విధానాలను మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. కారెలోన్ ఇప్పటికే హైదరాబాద్‌లో పని చేస్తోంది. ఇది మాకు ప్రధాన కేంద్రంగా మారినట్లు రజత్‌పురి చెప్పారు. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో భారీ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు సృష్టించనున్నట్లు చెప్పారు. తద్వారా తెలంగాణలో కార్యకలాపాలు భారీగా విస్తరిస్తామన్నారు. గత మూడున్నర ఏళ్లలో అత్యధిక వేతనాలు ఇచ్చే 8వేల ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు.
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. వైద్య పరికరాలు, కృత్రిమ మేథ రంగంలో అగ్రగామి సంస్థ అయిన అలైవ్‌కోర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరం హెల్త్ టెక్ హబ్‌గా మారుతున్న విషయాన్ని వారికి వివరించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన అలైవ్‌కోర్ ప్రతినిధులు.. తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ మెడ్‌టెక్ రంగం మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులను పసిగట్టేందుకు అలైవ్‌కోర్ రూపొందించిన ఈసీజీ-టెక్ విప్లవాత్మకమైనదని మంత్రి ప్రశంసించారు.
ప్రపంచంలోనే అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్ 'చికాగో బూత్ స్కూల్' డీన్ మాధవ్ రంజన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో విద్యా సంస్థల పరస్పర సహకారం ఆవశ్యకతపై చర్చించారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసీవ్ అనే మూడు అంశాల ద్వారా సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ తరహాలో ఇతర విద్యా సంస్థలతో కూడా బూత్ స్కూల్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌లె నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ కోరారు.