ప్రొఫైల్‌ పిక్ మారింది.. పార్టీ మారడమే మిగిలింది..!

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ సీనియర్ నేత మల్లు రవి సైతం విజయశాంతి పార్టీ మార్పుపై స్పందించారు. రెండు, మూడు రోజుల్లో విజయశాంతి పార్టీలోకి వస్తారని.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

Advertisement
Update:2023-11-14 08:15 IST

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి పార్టీ మార్పుపై కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ వార్తలను ఆమె ఎక్కడా ఖండించలేదు. తాజాగా ఆమె సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ప్రొఫైల్‌ పిక్ మార‌డం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ప్రొఫైల్‌ పిక్‌లో మోడీ, బ్యాగ్రౌండ్‌లో బీజేపీ గుర్తు ఉండేది. అయితే సోమవారం రాత్రి అటు ఫేస్‌బుక్‌లోనూ, ఇటు ట్విట్టర్‌లోనూ ప్రొఫైల్‌ పిక్‌ మార్చారు విజయశాంతి. అందులో మోడీ గానీ, బ్యాగ్రౌండ్‌లో బీజేపీకి సంబంధించిన గుర్తు కానీ లేవు. దీంతో విజయశాంతి పార్టీ మార్పుపై సిగ్నల్ ఇచ్చినట్లేనని భావిస్తున్నారు.

ఇక రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ సీనియర్ నేత మల్లు రవి సైతం విజయశాంతి పార్టీ మార్పుపై స్పందించారు. రెండు, మూడు రోజుల్లో విజయశాంతి పార్టీలోకి వస్తారని.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మల్లు రవి వ్యాఖ్యలపై విజయశాంతి ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళో, రేపో విజయశాంతి కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు బీజేపీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు విజయశాంతి. పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. పార్టీలో తన తర్వాత వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఆమె అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి.. రాష్ట్రంలో జరిగిన మోడీ, అమిత్ షా సభలకు సైతం హాజరు కాలేదు. ఇక మరోవైపు రాములమ్మతో చర్చలు జరిపిన కాంగ్రెస్‌ నేతలు.. ఆమెను పార్టీలోకి ఆహ్వానించగా.. అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి వలసలు విజయశాంతితో ఆగిపోతాయా.. మిగిలిన నేతలు కూడా తమ దారి చూసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News