బీజేపీ-జనసేన పొత్తు.. ఆ రెండు సీట్లపై సస్పెన్స్..!
ప్రధానంగా చేవేళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు ఇస్తారన్న ప్రచారంపై మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జనసేనతో పొత్తు ఉంటుందన్న ప్రచారంతో తెలంగాణ బీజేపీలోని పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 7-8 సీట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తారన్న ప్రచారంతో.. స్థానిక బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రయోజనాల కోసం ఇక్కడి అవకాశాలను బీజేపీ బలి చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా చేవేళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు ఇస్తారన్న ప్రచారంపై మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశిస్తున్న రవియాదవ్‌కు ఆయన మద్దతు తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో మంత్రి కేటీఆర్‌కు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. మున్సిపాలిటీలో ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరగా.. మరో ముగ్గురు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కార్పొరేటర్ల మద్దతు లేదని.. ఈ సీటు గెలిచేందుకు అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది.
ఇక కూకట్‌పల్లి విషయంలోనూ ఇదే అసంతృప్తి నెలకొంది. కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఆ స్థానం కోసం జనసేన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 2009లో ప్రజారాజ్యంకు వచ్చిన ఓట్లను ఉదహరిస్తున్నట్లు సమాచారం. 2009లో ప్రజారాజ్యం తరపున కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేయగా... దాదాపు 37 వేల ఓట్లు సాధించారు. దీంతో ఆయా స్థానాలపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.