భట్టి వర్సెస్ పొంగులేటి.. ఖమ్మం ఎంపీ టికెట్ వార్
ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని మల్లు నందిని పట్టుదలతో ఉన్నారు. తనకే టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కాగా.. మరొకరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు సోషల్‌మీడియాలో పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అంతా నందినమ్మ వెంటే అంటూ పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. మరోవైపు సర్వేల్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలిందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని మల్లు నందిని పట్టుదలతో ఉన్నారు. తనకే టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు. ఇక దరఖాస్తు సమయంలోనూ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు పొంగులేటి సైతం తన తమ్ముడిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. హైకమాండ్ దగ్గర ఖమ్మం ఎంపీ సీటు కోసం ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరీ.. చివరికి ఎవరు పై చేయి సాధిస్తారో..!