లబ్ధిదారుల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ కే

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు భరోసానిస్తోందని చెప్పారు హరీష్ రావు. ఎక్కడ చూసినా ఆ హామీలపైనే చర్చ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

Advertisement
Update:2023-11-21 13:10 IST

తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. ఆయా పథకాల లబ్ధిదారులు, వారి కుటుంబాల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ కే పడతాయనే అంచనాలున్నాయి. లబ్ధిదారులతోపాటు.. ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నవారు, తమ మేనిఫెస్టోపై భరోసా ఉన్నవారంతా తమకే ఓటు వేస్తారంటున్నారు మంత్రి హరీష్ రావు.

రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు సాయం అందించామని చెప్పారు హరీష్ రావు. సకాలంలో ఎరువులు, నాణ్యమైన విద్యుత్తు, ధాన్యం సేకరణ చేస్తున్నామని వివరించారు. రెండు పంటలు పక్కాగా పండుతున్నాయని, వ్యవసాయదారులంతా తమవైపే ఉన్నారని చెప్పారు. 47 లక్షల మంది ఆసరా పింఛను లబ్ధిదారులు ఏకపక్షంగా కేసీఆర్‌ ను పెద్దకొడుకుగా భావిస్తున్నారన్నారు. 13.50 లక్షల కల్యాణలక్ష్మి లబ్ధిదారుల కుటుంబాలు కేసీఆర్‌ వైపు చూస్తున్నాయన్నారు. బీడీ కార్మికుల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ కే పడతాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో రాష్ట్రంలో 6 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని ఆయా కుటుంబాలన్నీ కేసీఆర్ పై కృతజ్ఞత చూపుతున్నాయని అన్నారు హరీష్ రావు.

మా మేనిఫెస్టో సూపర్ హిట్..

కాంగ్రెస్ వి అలవికాని హామీలని ప్రజలకు అర్థమైపోయిందని, బీజేపీ మేనిఫెస్టో గురించి ఆలోచించడానికేమీ లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు భరోసానిస్తోందని చెప్పారు. రూ.5 వేలకు ఆసరా పెన్షన్ పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్‌ సిలిండరు, రూ.16 వేలకు రైతుబంధు సాయం పెంపు, అగ్రకులాల్లోని పేదలకు గురుకులాలు, అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చడం తదితర అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లామని వివరించారు. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు హరీష్ రావు. 


Tags:    
Advertisement

Similar News