ఖైదీ నెంబర్ 7917.. కరీంనగర్ జైలులో బండి
నిబంధనల ప్రకారం లోక్‌సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చాకే ఎంపీ సంజయ్ ను అరెస్ట్ చేశామన్నారు. సంజయ్ సెల్ ఫోన్ కనిపించడం లేదన్నారు. అది దొరికితే మరిన్ని కీలక ఆధారాలు బయటపడతాయంటున్నారు పోలీసులు.
మంగళవారం అర్థరాత్రి బండి సంజయ్ అరెస్ట్ తర్వాత బుధవారం రాత్రి 10.05 గంటలకు ఆయన్ను జైలుకి తరలించే వరకు.. పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన అరెస్ట్, విచారణ, మేజిస్ట్రేట్ ముందు హాజరు, జైలుకి తరలింపు.. అన్ని సందర్భాల్లోనూ బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. కావాలనే ఈ కేసులో బండిని ఇరికించారంటూ గోల చేస్తున్నా, పోలీసులు మాత్రం పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. అందుకే ఆయనకు 14రోజుల రిమాండి విధించారంటున్నారు.
మంగళవారం అర్థరాత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లో అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం 6.50 గంటలకు హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు పోలీసులు. మేజిస్ట్రేట్ బండికి 14రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత బండిని కరీంనగర్ జిల్లా జైలుకి తరలించారు. ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ ఈ రోజు జరుగుతుంది.
ఖైదీ నెంబర్ 7917
ఇతర ఖైదీలతోపాటు బండి సంజయ్ కు సాధారణ బ్యారక్ కేటాయించారు. హన్మకొండ నుంచి కరీంనగర్ కు తీసుకు వచ్చేటప్పుడు కూడా దారిలో బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. దీంతో పోలీసులు వారిని తొలగించుకుంటూ బండిని జైలు వరకు తెచ్చారు. నేరుగా వాహనంలోనే జైలులోకి తీసుకెళ్లారు. మిగతా చోట్ల అయితే తనకు ప్రాణ హాని ఉందని, కరీంనగర్ జైలుకే తరలించాలని బండి కోరడంతో.. ఆయన్ను అక్కడికే పంపించేలా మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు.
లోక్ సభ స్పీకర్ కి సమాచారమిచ్చి..
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీకి కుట్ర చేసినట్టు ఆధారాలు లభించడంతోనే ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం లోక్‌సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చాకే ఎంపీ సంజయ్ ను అరెస్ట్ చేశామన్నారు. సంజయ్ సెల్ ఫోన్ కనిపించడం లేదన్నారు. అది దొరికితే మరిన్ని కీలక ఆధారాలు బయటపడతాయంటున్నారు పోలీసులు.