ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి : బండి సంజయ్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపెడతానన్న ఆడియో టేపులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఇంకా ఎందుకు బయట పెట్టలేదని బండి ప్రశ్నించారు.

Advertisement
Update:2022-10-27 12:53 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి సాగించిన బేరసారాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అవసరం అయితే సీబీఐతో కేసు విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ఆయన ఆరోపించారు. మునుగోడు ప్రచారంలో ఉన్న ఆయన ఎంపీ అరవింద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపెడతానన్న ఆడియో టేపులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఇంకా ఎందుకు బయట పెట్టలేదని బండి ప్రశ్నించారు. ఒక ఉపఎన్నికలో గెలవడానికి ఇన్ని డ్రామాలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని.. మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్దమని తెలుసుకున్నారని సంజయ్ అన్నారు. కొన్ని ఛానల్స్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. ఇవ్వాళ, రేపు ప్రజలు చూస్తారేమో.. తర్వాత వాస్తవాలు బయటపడితే మీ ఛానల్స్ ఎవరు చూస్తారని ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్‌ వాళ్లదే, డబ్బులు తరలించింది ఎమ్మెల్యే వాహనమే, కంప్లైంట్ ఇచ్చింది కూడా వాళ్లే. మరి మధ్యలో బీజేపీ ఎక్కడి నుంచి వచ్చిందని సంజయ్ ప్రశ్నించారు. ఒక నిందితుడికి బీజేపీ వాళ్లతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. కానీ అతడికి మాతో కాదు.. టీఆర్ఎస్ నాయకులతోనే వ్యాపార సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ తతంగానికి మొత్తం కర్త అక్కడి సీపీ స్టీఫెన్ సన్ అని ఆరోపించారు. కమిషనర్‌ను తర్వాత ఎవరు కాపాడాలని ఆయన అన్నారు. సీసీ ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ప్రగతి భవన్‌తో పాటు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఎవరు కలిశారో బయటపెట్టాలని అన్నారు. ఆ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన వారందరి ఫోన్ కాల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని, సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. మేం చట్టాన్ని నమ్ముకుంటాం. హైకోర్టుకు వెళ్తామని అన్నారు. బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పిన పోలీసులు.. వాటిని ఓపెన్ చేసి మీడియాకు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. బీజేపీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

మునుగోడు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక వస్తే అభివృద్ధి జరిగింది. ఆ ఉద్దేశంతోనే రాజగోపాల్ రాజీనామా చేశారు. కానీ, టీఆర్ఎస్ మాత్రం అనవసరమైన ఆరోపణలు చేస్తోంది. అందరూ టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు గుర్తుంచుకొని బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News