ప్రజలు సంబరాలు చేసుకుంటే చూసి బండి సంజయ్ ఓర్వలేక పోతున్నారు : రెడ్కో చైర్మన్ వై. సతీశ్ రెడ్డి
సంబరాలకు అడ్డుపడుతున్న నువ్వ అసలు తెలంగాణ బిడ్డవేనా? ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని సన్నాసులు మీరు అని సతీశ్ రెడ్డి దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లయిన సందర్భంగా ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చూసి ఓర్వలేక పోతున్నారని రెడ్కో చైర్మన్ వై. సతీశ్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో, రాష్ట్రం సాధించడానికి ఎంత కష్టపడ్డామో తెలిస్తే.. ఇవ్వాళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామో బండి సంజయ్‌కు అర్థమయ్యేదని సతీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
సంబరాలకు అడ్డుపడుతున్న నువ్వు అసలు తెలంగాణ బిడ్డవేనా? ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని సన్నాసులు మీరు అని దుయ్యబట్టారు. ఉద్యమం చేస్తే ఇవ్వాళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామో తెలిసేదని అన్నారు. మీ డబుల్ ఇంజన్ అనేది అతిపెద్ద ఫెయిల్యూర్. కానీ తెలంగాణది అభివృద్ధి మోడల్ అని చెప్పారు. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వమే ప్రతీ ఏటా అవార్డులతో తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కడుతోందని అన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా 20 అవార్డులు ప్రకటిస్తే.. అందులో 19 అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చిన విషయాన్ని సతీశ్ రెడ్డి గుర్తు చేశారు.
ఇటీవల పల్లెల అభివృద్ధి విభాగంలో 46 అవార్డులు ప్రకటిస్తే.. అందులో 13 తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. 100 శాతం మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని మీ కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు.
ఒక్క తెలంగాణకే ఇన్ని అవార్డులు వచ్చాయి.. మరి మీ డబుల్ ఇంజన్ పాలన ఉన్న 10 రాష్ట్రాలకు ఎన్ని అవార్డులు వచ్చాయని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ పాలన మంచిది అయితే అవార్డులు ఎందుకు రావడం లేదని అన్నారు. 7 ఏళ్లలోనే తెలంగాణ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు. దేశంలోనే భూగర్భ జలాలు పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి ప్రతక్ష్య నిదర్శనాలని అన్నారు.
ఇన్ని విజయాలు సాధించాము కాబట్టే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ప్రజలు జరుపుకుంటున్న ఉత్సవాల్లో నువ్వు కూడా భాగస్వామిగా ఉంటావో లేదో తేల్చుకోని అని బండి సంజయ్‌ను సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, రైతులు, పంట బీమా ఇస్తామని చెబుతున్నావు కదా.. మరి కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడే చేయవచ్చుకదా అని ప్రశ్నించారు.
దేశాన్ని ఏలుతున్నది బీజేపీ ప్రభుత్వమే.. రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉచిత విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు ఇవ్వండని డిమాండ్ చేశారు. దేశంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయమని కోరారు. ఉద్యోగాలు భర్తీ చేయమని మోడీని అడుగు.. అంతే కానీ పదేళ్ల అభివృద్ధి పండుగ చేసుకుంటున్న ప్రజలను కించపరచ వద్దని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఉద్యమ స్పూర్తిని దెబ్బతీసేలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.