హైదరాబాద్‌లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం
మత్తు మందు ప్రభావం వల్ల చాలాసేపటి తరువాత తేరుకొని తన భర్త, మేనమామకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వారు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరం చెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త కూలి పనులు చేస్తాడు. భార్య గేటెడ్ కమ్యూనిటీ లో పనిచేస్తోంది.
ఆమె శుక్రవారం పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా, ఓ వ్యక్తి (30) ఆమెను అనుసరించాడు. తమ వద్ద పని ఉందని మభ్యపెట్టి ఆమె నుంచి ఫోన్ నంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఉదయం పనికి వెళుతుండగా.. బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైవేటు ఉద్యోగి సుమిత్‌కుమార్ శర్మ (33) కారులో ఆమెను అనుసరించారు.
పని ఇప్పిస్తామని ఆమెతో మాట్లాడుతూ.. బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకున్నారు. మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారు. దీంతో స్పృహ కోల్పోయిన మహిళను కిస్మత్‌పూర్, దర్గా ఖలీజ్‌ఖాన్, ఓఆర్ఆర్ పై కారులో తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం రాత్రి వేళ ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కుని, ఆమెను గండిపేట సమీపంలో వదిలి వెళ్లిపోయారు.
మత్తు మందు ప్రభావం వల్ల చాలాసేపటి తరువాత తేరుకొని తన భర్త, మేనమామకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వారు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. బాధితురాలితో మాట్లాడిన సెల్‌ఫోన్ నంబర్లు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిపై పాత కేసులు కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను తక్షణమే పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను చైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆదేశించారు.