తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ.. అక్కడ అలా, ఇక్కడ ఇలా..

తెలంగాణ విషయానికొస్తే, ఆర్టీసీ అభివృద్ధిలో ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతోంది. పెట్రోల్‌ బంక్‌ లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించింది.

Advertisement
Update:2023-01-09 15:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ.. అక్కడ అలా, ఇక్కడ ఇలా..

రాష్ట్ర విభజన తర్వాత వనరుల్లో ఎక్కువ శాతం తెలంగాణకు వెళ్లిపోయాయని, అందుకే ఏపీని అభివృద్ధిలో ముందుంచలేకపోయామనేది ఇక్కడి నాయకుల వాదన. ఐటీ వంటి రంగాల్లో తెలంగాణతో ఏపీ ఎప్పటికీ పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తోంది. చివరకు మీడియా కూడా ఏపీకి వెళ్లిపోకుండానే పని కానిచ్చేస్తోంది. మౌలిక వసతుల లేమి, రాజధాని ప్రాంతం అభివృద్ధి కాకపోవడం ఏపీకి ఉన్న ప్రధాన సమస్యలు. ఇక ఆర్టీసీ విషయానికొద్దాం. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసుకున్నారనేది ప్రధానమైన అడ్వాంటేజ్. జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల నెత్తిన పాలు పోశారని, వారి జీవితాలు మార్చేశారనేది జరుగుతున్న ప్రచారం. కానీ వాస్తవంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఉద్యోగుల జీవితాల్లో వారు ఆశించిన మార్పులు రాలేదనేది, రాబోవనేది క్షేత్ర స్థాయి వాస్తవం.

ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక్కటీ విడుదల కాలేదు. ఉన్నవారు రిటైర్ అయిపోతే, కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగులు వస్తున్నారే కానీ అంతకు మించి ఇంకేమీ జరగలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో గతంలో ఎలాంటి ఆలస్యం జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కత్తిమీద సాములా మారింది. ఇటీవల ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి అప్పగించేశారనే అపవాదు మూటగట్టుకుంది. ఈ వ్యవహారంలో చివరకు బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ పై వేటుపడింది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఆర్టీసీ స్థలాలు అభివృద్ధి పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా అధికారులు అడ్డు చెప్పలేని పరిస్థితి ఉందని ఆరోపణలు వినపడుతున్నాయి.

తెలంగాణ విషయానికొస్తే, ఆర్టీసీ అభివృద్ధిలో ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతోంది. ప్రచారంలో కొత్తపుంతలు తొక్కింది. రాయితీలతో ప్రయాణికుల్ని ఆకట్టుకుంటోంది. పెట్రోల్‌ బంక్‌ లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించింది. టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్‌ ‘జీవ’ పేరుతో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను ప్రయాణికులకు అందిస్తోంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ వాటర్ బాటిళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారు. త్వరలోనే అరలీటర్ బాటిల్స్, ఆఫీస్ లకోసం వాటర్ క్యాన్లు కూడా తయారు చేయడానికి టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది.




రాష్ట్రం విడిపోయే నాటికి ఆర్టీసీ విషయంలో వనరులు సమానం, ఆస్తులు సమానం. కానీ సంస్థ విడిపోడానికి కాస్త టైమ్ పట్టింది. ఆ తర్వాత కూడా తెలంగాణ ఆర్టీసీ బలోపేతం కోసం జరిగిన కృషి ఏపీలో జరగలేదు. ఫలితం ఇప్పుడు కళ్లముందు కనపడుతోంది.

Tags:    
Advertisement

Similar News