మళ్లీ మొదలైంది.. విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణకు ఏపీ అల్టిమేటం

తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌పై రూ.3,441.78 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉందని వాటిని వెంటనే క్లియర్ చేయాలని మరోసారి ఏపీ నోటీసులు ఇచ్చింది.

Advertisement
Update:2023-01-31 09:10 IST

విభజన సమయం నుంచి మొదలైన ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు ఇప్పటి వరకు ఏవీ ఓ కొలిక్కి రావడం లేదు. వీటికి తోడు విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిల వివాదం ఇప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రేపుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఏపీకి చెందిన జెన్‌కో తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించిన బిల్లు చెల్లించాలని తెలంగాణను కోరుతోంది.

అయితే, తెలంగాణకు చెందిన పొల్లూరు (సీలేరు నదిపై) విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏపీలోకి వెళ్లిపోయిందని.. ఆ మేరకు తాము విద్యుత్‌ను నష్టపోయామని తెలంగాణ అంటోంది. కాగా, ఇప్పటి వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌పై రూ.3,441.78 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉందని వాటిని వెంటనే క్లియర్ చేయాలని మరోసారి ఏపీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ డిస్కమ్స్ ఈ మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిందని..గత ఏడేళ్లుగా ఈ బకాయిల కోసం అడుగుతున్నా తెలంగాణ డిస్కమ్స్ నుంచి సమాధానం లేదని ఏపీ జెన్‌కో అధికారులు అంటున్నారు. ఈ ఏడేళ్ల పెనాల్టీ కూడా వేస్తే బకాయిలు రూ.4వేల కోట్లు దాటిపోతాయని వారు చెబుతున్నారు.

ఇప్పటి వకు అయిన రూ.3,441.78 కోట్ల బిల్లు విషయంలో ఇప్పటికే ఏపీ జెన్‌కో, తెలంగాణలోని రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. దీని ప్రకారం పెనాల్టీ లేకుండా ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లిస్తామని డిస్కమ్స్ చెప్పాయి. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా కట్టలేదని ఏపీ జెన్‌కో చెబుతోంది. ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేసింది.

తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి గతంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి భారీ లోన్లు తీసుకున్నామని ఏపీ జెన్‌కో అంటోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రతీ నెల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని.. అందుకే తెలంగాణ డిస్కమ్‌లపై ఒత్తిడి తెస్తున్నామని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ వివాదంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెలలోనే (జనవరి 2023) మూడుసార్లు కేసును వాయిదా వేశారు. 

Tags:    
Advertisement

Similar News