యాంటీ బయోటిక్స్ వాడకంలో.. మూడో స్థానంలో తెలంగాణ
ఢిల్లీ ప్రతీ 1000 మందిలో 23.5 మంది, పంజాబ్‌లో 22.9 మంది, తెలంగాణలో 15.3 మంది డైలీ యాంటీ బయోటిక్ డోస్ వాడుతున్నారు.
ప్రతీ చిన్న జబ్బుకు యాంటీ బయోటిక్స్ వాడకం ఎక్కువయ్యింది. వైద్యులే తమ ప్రిస్కిప్షన్స్‌లో యాంటీ బయోటిక్స్ సూచించడంతో వీటి వాడకం మరింతగా పెరిగిపోయింది. ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వేలో.. దేశంలో యాంటీ బయోటిక్స్ వాడకంలో టాప్ 3 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. యాంటీ బయోటిక్స్ అనవసర (లేదా) అత్యధిక వాడకం యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెప్పారు. ఇలా విస్తృత వాడకం కారణంగా అవసరమైన సమయంలో సూపర్ బగ్స్‌ను యాంటీ బయోటిక్స్ చంపలేక పోతున్నట్లు తేల్చారు.
జర్నల్ ఆఫ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనే సైంటిఫిక్ జర్నల్ తాజాగా యాంటీ బయోటిక్స్‌కు సంబంధించి ఒక నివేదికను ప్రచురించింది. దేశంలో 2011 నుంచి 2019 మధ్య యాంటీ బయోటిక్స్ వాడకంలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గినట్లు ఆ నివేదిక తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఈ యాంటీ బయోటిక్స్ వాడకంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి.
ఢిల్లీ ప్రతీ 1000 మందిలో 23.5 మంది, పంజాబ్‌లో 22.9 మంది, తెలంగాణలో 15.3 మంది డైలీ యాంటీ బయోటిక్ డోస్ వాడుతున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. ఇక మధ్యప్రదేశ్‌లో 7.2 మంది, బీహార్‌లో 8.1 మంది, రాజస్థాన్‌లో 8.3, జార్ఖండ్‌లో 8.5, ఒడిషాలో 8.9 మంది యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. కాగా, ఈ సర్వే జరుగుతున్న సమయంలోనే తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాల్లో వీటి వాడకం పెరిగింది. ముఖ్యంగా రాష్ట్రాల పర్-క్యాపిటా ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే యాంటీ బయోటిక్స్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక దేశంలో యాంటీ బయోటిక్స్ వాడకం 3.6శాతం మేర తగ్గిపోయింది. అంతే కాకుండా వీటి అందుబాటు కూడా 13.1 శాతానికి పడిపోయినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యాంటీ బయోటిక్స్ వాడకం పరిశీలిస్తే.. ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్‌లో యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ రాయడంలో విఫలం అవుతున్నారని కూడా నివేదిక వెల్లడించింది. రోగికి ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోయినా యాంటీ బయోటిక్స్ రాస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 9,000 మంది స్టాకిస్టులు.. 5,000 ఫార్మా కంపెనీలు, 18వేల మంది చిన్న డిస్ట్రిబ్యూటర్లు, 5 లక్షల మంది రిటైలర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇది దేశంలోని 60 శాతం మంది స్టాకిస్టులతో సమానం.
ఈ రీసెర్చ్‌ను బోస్టన్ యూనివర్సిటీకి చెందిన బృందం చేపట్టింది. వీరికి ఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారం అందించింది. షఫి ఫజలుద్దీన్, సెంథిల్ గణేష్, శక్తివేల్ సెల్వరాజ్, వెరోనికా జే రిట్జ్, సాండ్రో గెలియా, పీటర్ రాకర్స్ వంటి పరిశోధకులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు.