2022 జ్ఞాపకాలు.. హైదరాబాద్ అభివృద్ధిలో మైలురాళ్లు..

హైదరాబాద్ విషయానికొస్తే 2022 సంవత్సరం ఎన్నో అరుదైన జ్ఞాపకాలను మిగిల్చింది, హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లను వదిలి వెళ్తోంది.

Advertisement
Update:2022-12-31 06:00 IST

కేలండర్ మారే సమయంలో ప్రతి ఏడాదీ ఎన్నో జ్ఞాపకాలను వదిలి వెళ్తుంది. వాటిలో పదిలమైనవి కొన్నే ఉంటాయి. అవి పది కాలాలపాటు గుర్తుంటాయి. హైదరాబాద్ విషయానికొస్తే 2022 సంవత్సరం ఎన్నో అరుదైన జ్ఞాపకాలను మిగిల్చింది, హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లను వదిలి వెళ్తోంది. అందులో కొన్ని..


టి-హబ్ 2.0

హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి టి-హబ్ 2.0 . స్టార్టప్ కంపెనీలకోసం ఏర్పాటు చేసిన టి-హబ్ రెండోదశ టి-హబ్ 2.0 మరింత ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. 2022 జూన్-28న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ భవనాన్ని కొరియన్ కంపెనీ డిజైన్ చేసింది. 2వేల కంటే ఎక్కువ స్టార్టప్‌లు, కార్పొరేషన్లు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంది. భవిష్యత్‌లో భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్‌ లను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టి-హబ్ రెండో దశలో పెట్టుబడులు పెట్టింది.




సమతా విగ్రహం..

తెలంగాణలో 216 అడుగుల భారీ నిర్మాణం రామానుజా చార్యుని సమతా మూర్తి విగ్రహం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహం ఇది. రామానుజుడి బోధనలను ప్రతిబింబించేలా, ఆయన స్ఫూర్తిని చాటేలా దీన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి ఈ విగ్రహం ఏర్పాటుకి కృషిచేయగా 2022 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. వెయ్యికోట్ల రూపాయల ఖర్చుతో విగ్రహం, ఈ ప్రాంగణంలో నిర్మాణాలు చేపట్టారు. ఇది ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.



బన్సీలాల్ పేట మెట్లబావి..

హైదరాబాద్ వారసత్వ సంపదను పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమే బన్సీలాల్ పేట మెట్లబావి పునరుద్ధరణ. 17 వ శతాబ్దపు జ్ఞాపకం ఇది. శిథిలావస్థకు చేరి, పాడైపోయి, చెత్తాచెదారంతో కప్పి ఉన్న ఈ "నాగన్నకుంట"ను రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సహకారంతో పునరుద్ధరించింది. బన్సీలాల్‌ పేట్ లో ఉన్న ఈ నిజాం కాలం నాటి మెట్ల బావి పునరుద్ధరణకు 500 రోజుల సమయం పట్టింది. వందమంది నిపుణులు, వెయ్యిమంది కార్మికులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ మెట్లబావిలో దాదాపు 2వేల టన్నుల వ్యర్థాలు పడిపోయాయి. వాటన్నిటినీ తొలగించి దీనికి సరికొత్త రూపు తెచ్చారు. ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా, గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.




 హైదరాబాద్ ఎయిర్‌ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్..

మెట్రో రైలు హైదరాబాద్ కే తలమానికం. అలాంటిది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ని కనెక్ట్ చేస్తూ కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెట్రో లైను మరింత ఆసక్తిగా మారింది. మాదాపూర్‌ లోని మైండ్‌ స్పేస్ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ ని కలిపే ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ పనులకు 2022 డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 31 కిలోమీటర్ల ఈ మెట్రో కారిడార్‌ కు రూ.6,250 కోట్లు ఖర్చవుతుంది. మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఫేజ్ I మెట్రోకి భిన్నంగా ఇది ఉంటుంది. ఎలివేటెడ్, గ్రౌండ్ లెవల్, అండర్ గ్రౌండ్ ట్రాక్ లను కలిగి ఉంటుంది.




 ముక్తిఘాట్..

విశ్వాసాలు వేరయినా, ఆచారాలు వేరయినా.. అందరూ మరణించాక వెళ్లాల్సింది శ్మశానానికే. కానీ ఇప్పటి వరకూ అన్ని వర్గాలకు వేర్వేరు శ్మశాన వాటికలు ఉండేవి. తొలిసారిగా అన్ని మత విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని, అందరికీ అందుబాటులో ఉండేలా ఎల్బీనగర్ లో ముక్తిఘాట్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7న దీన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 6.5 ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ విశ్వాసాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి ఇక్కడ స్థలాలు కేటాయించారు. అంతిమ సంస్కారాలను ఆన్‌ లైన్‌ లో చూసే ఏర్పాటు కూడా ఉంది. అన్ని శ్మశానవాటికలలో ప్రత్యేక ఆఫీస్ రూమ్, కోల్డ్ స్టోరేజ్, ప్రార్థనా మందిరం, టాయిలెట్ బ్లాక్, వాహనాల పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు.




 స్కైరూట్ 2022

హైదరాబాద్‌ కు చెందిన స్పేస్ టెక్ స్కైరూట్ ఏరోస్పేస్ 2022లో చరిత్ర సృష్టించింది. ఇది T-హబ్ ఇంక్యుబేటెడ్ కంపెనీ, నవంబర్ 2022లో భారతదేశంలో మొట్టమొదటిగా ప్రైవేటుగా నిర్మించిన శాటిలైట్ లాంచ్ వెహికల్ విక్రమ్-ఎస్‌ ను సబ్‌ ఆర్బిటల్ స్పేస్‌ లోకి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట లోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగించారు. భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలికింది స్పేస్ టెక్ స్కైరూట్. నవంబర్ 27న ISRO ప్రయోగించిన PSLV C54 వాహక నౌక ద్వారా హైదరాబాద్ కి చెందిన ధృవ స్పేస్ కంపెనీ తయారు చేసిన థైబోల్ట్-1, థైబోల్ట్-2 నానో ఉపగ్రహాలను ప్రయోగించారు. హైదరాబాద్ ఆధారిత ప్రైవేట్ స్టార్టప్ లో భాగంగా ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.




ఇండియన్ రేసింగ్ లీగ్

భారత్ లో తొలిసారి స్ట్రీట్ సర్క్యూట్ రేస్ హైదరాబాద్ లో జరగడం గమనార్హం. ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) స్టార్టింగ్ ఎడిషన్ ఇది. ఇందులో భాగంగా మొదటి రేస్ ని నవంబర్ 19న ప్రారంభించగా, చివరి రేస్ ని డిసెంబర్ 11న నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ ను జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని ఏకైక స్ట్రీట్ సర్క్యూట్ అయిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో 2.7 కిలోమీటర్ల పొడవైన ఈ రేస్ ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.




 

Tags:    
Advertisement

Similar News