ఓటేస్తే ఏమొస్తుంది.. ? ముందు నామినేషన్ వేసెయ్..

2018 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో 33మంది నామినేషన్లు వేయగా.. 15మంది చివరిగా బరిలో నిలిచారు. ఈసారి మాత్రం రికార్డ్ స్థాయిలో 141 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement
Update:2022-10-15 08:03 IST

ఎన్నికల్లో ఓటుకి నోటు తెలిసిందే. మునుగోడు లాంటి కాంపిటీషన్ ఉన్న నియోజకవర్గాల్లో నోటుతోపాటు బైక్ లు, కార్లు, బంగారు వస్తువులు, వెండి గిన్నెలు.. ఇలా చాలా రకాల పేర్లు వినపడుతున్నాయి. అయితే అంతకు మించి కావాలంటే ఏం చేయాలి. ఓటుకంటే ముందు ఓ నామినేషన్ పడేయాలి. అందుకే మునుగోడు పోరులో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు ఏకంగా 100కి పైగా నామినేషన్లు వేశారు. మొత్తంగా మునుగోడు కోసం 141 నామినేషన్లు పడ్డాయి.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు బలంగా సాగే అవకాశముంది. ఈ దశలో టీడీపీ, జనసేన కూడా తమకెందుకులే అని సైలెంట్ గా ఉన్నాయి. మరి స్వతంత్ర అభ్యర్థులకు అంత ధైర్యం ఏంటి..? మునుగోడులో పోటీఇవ్వగలరా..?

గతంలో స్వతంత్ర అభ్యర్థుల వల్ల చాలామంది ప్రధాన పార్టీల నేతల జాతకాలు తారుమారైన సంగతి తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులుంటాయనే ఇటీవల టీఆర్ఎస్ నేతలు స్వతంత్రుల గుర్తుల విషయంలో కొన్నింటిని నిషేధించాలని ఈసీకి వినతిపత్రం ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి విషయాలే కొంతమంది స్వతంత్రులకు లాభసాటిగా మారతాయి. నామినేషన్ విరమించుకోడానికి బేరసారాలు మొదలవుతాయి.

సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో పోటీ ఉండదు. 2018 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో 33మంది నామినేషన్లు వేయగా.. 15మంది చివరిగా బరిలో నిలిచారు. ఈసారి మాత్రం రికార్డ్ స్థాయిలో 141 నామినేషన్లు దాఖలయ్యాయి. అందర్నీ ఒకేగాటన కట్టలేం కానీ, దాదాపుగా ప్రతి ఉప ఎన్నికల్లోనూ జరిగే తంతు ఇదే. అందులోనూ మునుగోడు ఉప ఎన్నిక కోసం డబ్బులు వెదజల్లుతున్నారనే ప్రచారంతో స్వతంత్ర అభ్యర్థులంతా ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. 18వేల కోట్లకు అమ్ముడైపోయిన ఆసామి, స్వతంత్రులకోసం కాస్త‌యినా ఖర్చుపెట్టలేరా అనేది కొంతమంది ఆలోచన. మరి దాని ఫలితం ఎలా ఉంటుందో.. నామినేషన్ల విత్ డ్రా రోజు తేలిపోతుంది. ఈరోజు, రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

హ్యాండిచ్చిన గద్దర్..

ప్రజాశాంతి పార్టీ తరపున మునుగోడు బరిలో దిగుతారనుకున్న ప్రజా గాయకుడు గద్దర్ చివరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో అభ్యర్థులు దొరక్క పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఈనెల 17న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మునుగోడులో నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్‌, 6న కౌంటింగ్, ఫలితాలు వెలువడతాయి.

Tags:    
Advertisement

Similar News