ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేస్తున్నట్టు తెలిపింది.

Advertisement
Update: 2024-07-11 00:30 GMT

ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులని ధర్మాసనం స్పష్టం చేసింది. బుధవారం దీనిపై తీర్పు వెలువరించింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అతని పిటిషన్‌ను కొట్టివేసింది.

జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్, జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జ‌రిపిన అనంతరం తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు విడాకుల తర్వాత తమ భర్త నుంచి భరణం కోరవచ్చని స్పష్టం చేసింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేస్తున్నట్టు తెలిపింది.

సెక్షన్‌ 125 అనేది మహిళలందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్‌ కింద వివాహితలు భరణం కోరవచ్చని తెలిపింది. భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదని, భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదని పేర్కొంది. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News