రాహుల్‌ క్లిక్‌.. ప్రియాంక పోజు

ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఆత్మీయ సన్నివేశం

Advertisement
Update:2024-11-28 17:26 IST

ఇటీవల వాయనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆమె సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకున్నది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రమాణ స్వీకారంలో భాగంగా ప్రియాంక పార్లమెంటులోకి వస్తుండగా.. స్టాప్‌ అంటూ రాహుల్‌ ఆమెను ఆపారు. ఫొటోకు ఒక పోజు ఇవ్వమని చెప్పగా.. ప్రియాంక చిరునవ్వులు చిందించారు. తర్వాత ఇతరులతో కలిసి పోజివ్వగా రాహుల్‌ ఫొటో క్లిక్‌మనిపించారు. నెహ్రూ-గాంధీ వారసులైన ఈ అన్నాచెల్లెలు సందర్భం వచ్చినప్పుడల్లా వారికున్న ఆప్యాయతను బైటికి వ్యక్తం చేస్తుంటారు. వయనాడ్‌లో చెల్లెలి గెలుపు కోసం రాహుల్‌ ప్రచారం చేయగా.. గెలిచిన అనంతరం అన్న గురించి ప్రియాంక గొప్పగా చెప్పారు. 'రాహుల్‌.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపి, నా వెంటంటి నిలిచినందుకు థాంక్యూ' అని ప్రకటించారు.



ప్రియాంక రాకతో ఇప్పుడు ఒకేసారి ముగ్గురు నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులు పార్లమెంటు ఎంపీలుగా కొనసాగుతున్నారు. సోనియా గాంధీ రాజ్యసభ ఎంపిగా ఉండగా.. రాహుల్‌ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీ మొదటి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి సీపీఐ నేత సత్యన్ మొకేరిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రాహుల్‌ 3.64 మెజారిటీతో గెలిచారు. రాహుల్‌ మెజారిటీని ప్రియాంక అధిగమించి మొదటిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 

Tags:    
Advertisement

Similar News