సవాళ్ల నడుమ రాహుల్ భారత్ జోడో యాత్ర
అత్యంత ఉత్సాహంగా ఆరంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అసలైన సవాళ్ళు మహారాష్ట్రలోకి ప్రవేశించడంతోనే మొదలయ్యాయి. బెదిరింపుల నడుమనే యాత్రా బృందం మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది.
మధ్యప్రదేశ్‌లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేశారని బీజేపీ ఐటీసెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయా శుక్రవారం ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జోడో యాత్రలో రాహుల్‌తోపాటు నడిచిన ప్రముఖ నటి రిచా చద్దాను కూడా వివాదంలోకి లాగారు. ఇలాంటి కుటిల వ్యూహాల్ని తాము ముందే ఊహించామని, అది ఫేక్ వీడియో అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ సమాధానమిచ్చారు. యాత్రను అడ్డుకోవడం లేదా అప్రతిష్ట పాల్జేయడమనే వ్యూహంలో భాగమే బీజేపీ ఐటీ సెల్ ఫేక్ వీడియో నిర్వాకం. ఉత్తరాదిలో జోడోయాత్ర ఇలా మున్ముందు అనేక సవాళ్ళను ఎదుర్కొనుంది.
అత్యంత ఉత్సాహంగా ఆరంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అసలైన సవాళ్ళు మహారాష్ట్రలోకి ప్రవేశించడంతోనే మొదలయ్యాయి. బెదిరింపుల నడుమనే యాత్రా బృందం మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇక్కడ రెండో రోజు పాదయాత్రలో ప్రియాంక గాంధీ, రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పాల్గొన్నారు. వందలమంది యాత్రలో భాగస్వాములవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 380 కిలోమీటర్ల దూరం సాగే యాత్ర డిసెంబర్ 4న రాజస్థాన్‌లో ప్రవేశించనుంది.
మహారాష్ట్రలో జోడోయాత్ర సందర్భంగా వీర్‌సావర్కర్ మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. హిందూత్వ ప్రతినిధిగా ఉన్న సావర్కర్ బ్రిటీషు వారికి లొంగిపోయిన మాట చారిత్రక వాస్తవం. కానీ, వాస్తవాల కన్నా ఉద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే ధోరణి వివాదాలకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జోడోయాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తే బాంబులు పేలుస్తామనే బెదిరింపులు వచ్చాయి.
దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలలో జోడోయాత్రకు ఊహించనిరీతిన మంచి స్పందన వచ్చింది. వేలాది మంది యాత్రలో పాల్గొన్నారు. విభిన్న సామాజిక శ్రేణులు, కవులు, రచయితలు, మేధావులు రాహుల్‌తో కలిసి నడిచేందుకు, ముచ్చటించేందుకు ముందుకు వచ్చారు. జోడో యాత్ర ఫలవంతమవుతూ కర్నాటక నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించడంతోనే అసలైన సవాళ్ళు మొదలయ్యాయి. రాజకీయంగా దక్షిణాదికీ, ఉత్తరాదికీ మధ్య అంతరమే దీనికి మూలం.
హేతువు, తార్కికత, సైద్ధాంతికత ఆధారిత రాజకీయాలకు ఆలవాలం దక్షిణాది ప్రాంతం. ఇందుకు భిన్నమైంది ఉత్తరాది రాజకీయ ప్రాంగణం. దక్షిణాదిన తమిళనాడు కన్యాకుమారిలో రాహుల్ యాత్ర ఆరంభమైంది. తమిళ రాజకీయాల్లో పెరియార్ రామస్వామి, కామరాజ్ నాడార్, ద్రవిడ రాజకీయాలకు హేతువాదం, నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల చైతన్యం పునాదులుగా ఉన్నాయి. కన్యాకుమారి నుంచి కేరళ వైపుగా సాగిన యాత్రకు ఘనస్వాగతం లభించడం సహజం. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం, దశాబ్దాలుగా కమ్యూనిస్టు ఉద్యమాల, సోషలిస్టు భావజాలాల ప్రాబల్యం అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ కమ్యూనిస్టు ఉద్యమాలు, హేతువాదం, లౌకిక విధానాలు బలంగా ఉన్నాయి. మతరాజకీయాలకు తెలుగునాట చోటు లేదు. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ సామాజిక ఉద్యమాలు బలంగా ఉన్నాయి. శైవం పునాదిగా బలమైన సాంస్కృతిక ఉద్యమాల చైతన్యం సంఘ్ పరివార్ రాజకీయాల్ని ప్రతిఘటిస్తున్నది. కనుకనే విభజన, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర దక్షిణాదిన ఎనలేని ఆదరణ పొందింది.
మహారాష్ట్రలోకి రావడంతో ఈ దృశ్యం మారింది. మధ్యప్రదేశ్‌లో సాగుతున్న జోడోయాత్రని అడ్డుకోవాలనే కుట్రలకు తెరదీసింది సంఘ్ పరివార్. నిజానికి మధ్యప్రదేశ్‌లో 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టినప్పటికీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసింది బీజేపీ. అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ ప్రాబల్యం గల మధ్యప్రదేశ్‌లో సాగుతున్న జోడోయాత్రను అప్రతిష్ట పాల్జేసేందుకు బీజేపీ ఐటీసెల్ తెగబడింది. తమ సమస్యల మీద స్పందించకపోతే జోడోయాత్రను అడ్డుకుంటామని రాజస్థాన్‌లోని గుజ్జర్ల వర్గం బెదిరింపులకు దిగింది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొదలయిన ఉత్తరాది ప్రాంతాల్లో రాహుల్ జోడోయాత్రకు అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో హిందూత్వ భావజాల ప్రభావం అధికం. బీజేపీ బలంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. ఉత్తరాది రాష్ట్రాలలో కమ్యూనిస్టు భావజాలానికి చోటులేదు. హేతువాద ఉద్యమాలు కనిపించవు. చారిత్రకంగా చూసినప్పటికీ ఉత్తరాదిలో ఎలాంటి సంస్కరణోద్యమాలు రాలేదు. రాజపుత్రులు, ఠాకూర్లు, జాట్‌ల పెత్తనాలు అధికం. గ్రామాల్లో ఫ్యూడల్ పెత్తనాలు ఎక్కువ. దళిత బహుజన ఉద్యమాలు సైతం వీటిని ఎదుర్కోలేకపోయాయి. బీహార్‌లో మాత్రమే విభిన్న కమ్యూనిస్టుపార్టీలకు కొంత పునాది వుంది. కనుక భావజాల రీత్యా స్పష్టమైన సైద్ధాంతికతకు, హేతువుకు, తార్కికతకు, తాత్విక భావధారకు తగిన వాతావరణం ఉత్తరాదిలో లేదు. అంతేగాక హిందూత్వ రాజకీయాల చెరలాట జనాల్ని ప్రభావితం చేస్తున్నది. విద్యాపరంగా వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో లౌకికవాద పునాదులు బలహీనంగా ఉన్న ఉత్తరాదిలో భారత్ జోడోయాత్రకు మరిన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం సంభవించడం బీజేపీకి ఇష్టం లేదు. కనుకనే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో జోడోయాత్ర మీద నరేంద్రమోడీ పరోక్ష విమర్శలు చేశారు. కాషాయ పరివారపు సవాళ్ళను ఎదుర్కోవడం రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైన అవసరం. మున్ముందు రాజకీయ వాస్తవికతను గుర్తించి వ్యవహరించేందుకు ఇది తప్పనిసరి.