అమేథీ బరిలో రాహుల్ కాదు.. రాబర్ట్..!
స్మృతి ఇరానీని గెలిపించి తప్పు చేశామన్న భావనలో అమేథీ ప్రజలు ఉన్నారని చెప్పారు వాద్రా. తిరిగి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవాలని వారు భావిస్తున్నారన్నారు.
గాంధీ ఫ్యామిలీకి కంచుకోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక ప్రకటన చేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు హింట్ ఇచ్చారు. తను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని అమేథీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
స్మృతి ఇరానీని గెలిపించి తప్పు చేశామన్న భావనలో అమేథీ ప్రజలు ఉన్నారని చెప్పారు వాద్రా. తిరిగి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవాలని వారు భావిస్తున్నారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తాను భావిస్తే.. అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
స్మృతి ఇరానీ కేవలం గాంధీ ఫ్యామిలీని విమర్శించడానికే ఉన్నారని.. నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు వాద్రా. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహించే వారేవరైనా ప్రజల బాగు కోసం పని చేయాలన్నారు వాద్రా. కక్షపూరిత రాజకీయాల కోసం కాదన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో ఓడిపోయారు. ఇప్పటివరకూ రాయ్‌బరేలీ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించిన సోనియాగాంధీ.. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. రాజస్థాన్ నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు సోనియా. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.