ఝార్ఖండ్‌లో జేఎంఎం వర్సెస్‌ బీజేపీ

సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జేఎంఎం కూటమి.. అవినీతి కేసులో హేమంత్‌ అరెస్ట్‌, అక్రమ చొరబాట్లపై బీజేపీ ఆశలు

Advertisement
Update:2024-11-13 15:51 IST

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి ఫేజ్‌ పోలింగ్‌ జరుగుతున్నది. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో తొలి విడుతలతో 43 సీట్లుకు పోలింగ్‌ కొనసాగుతున్నది. ఈ విడుతలో అధికార జేఎంఎం 23 చోట్ల, కాంగ్రెస్‌ 17, ఆర్జేడీ 5 చోట్ల పోటీ చేస్తున్నాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఏడు చోట్ల బరిలో నిలిచింది. ఈ ఫేజ్‌లోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపయీ సోరెన్‌, ఆయన కుమారుడు బాబులాల్‌ సోరెన్‌, మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా సతీమణి మీరా ముండా, మరో మాజీ సీఎం మధు కొడా సతీమణి గీతా కొడా, రఘువర్‌ దాస్‌ కోడలు పూర్ణిమా సాహూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం మైయాన్ సమ్మాన్ యోజనతో సహా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రెండవసారి అధికారంలోకి తీసుకొస్తాయని భావిస్తున్నది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అవినీతి కేసులో అరెస్టు చేయడాన్ని ఎత్తి చూపుతూ, మహా కూటమి ప్రభుత్వం హయాంలో అక్రమ చొరబాట్లను, అవినీతిని అరికట్టడానికి ఎన్డీఏ హామీ ఇచ్చింది. అలాగే బీజేపీ హామీల్లో ముఖ్యమైనది చొరబాటు దారులు బైటికి పంపించడం. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమలు, మహిళలకు ప్రతి నెల రూ. 2,100, యువతకు 5 లక్షల ఉద్యోగాల కల్పన పై ఆశలు పెట్టుకున్నది.బీజేపీ గెలుపు కోసం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విస్తృతంగా ప్రచారం చేశారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 సీట్లు గెలుపొందగా, బీజేపీ 25 సీట్లు గెలిచింది. 2014 లో ఆ పార్టీ 37 సీట్లలో విజయం సాధించింది. జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి 47 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండో విడత పోలింగ్‌ ఈ నెల 20న జరగనున్నది. నవంబర్‌ 23 న ఫలితాలు వెల్లడవుతాయి.

Advertisement

Similar News