ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Advertisement
Update:2024-10-21 12:51 IST

దేశంలో ఉగ్రవాదాన్నిపూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్‌ షా నివాళులు అర్పించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. డ్రగ్స్‌, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగాల వల్లనే దేశం సురక్షితంగా ఉన్నదని అమిత్‌ షా అన్నారు. గత ఏడాది కాలంలో సుమారు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారనిన పేర్కొన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు. మా పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్‌, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొన్నది. అయినా మా పోరాటాన్ని ఆపబోమన్నారు. కశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, సైబర్‌నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్‌ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News