దేశంలో ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటున్నది రోజువారీ కూలీలు, గృహిణులే!
2019లో 1,39,123గా ఉన్న ఆత్మహత్యల సంఖ్య 2020లో 1,53,052కి, 2021లో 1,64,033కి పెరిగిందని, మూడేళ్ల కాలంలో ఆత్మహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతోందని NCRB డేటా వెల్లడించింది.
2019, 2021 మధ్య దేశవ్యాప్తంగా ఆత్మహత్యల చేసుకొని మరణించిన వారిలో రోజువారీ వేతన కూలీలు అతి ఎక్కువ మంది ఉన్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది.
ఆ తర్వాత స్థానంలో గృహిణులున్నారు. ఆతర్వాత స్థానాల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉన్నారు.
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎన్‌సీఆర్‌బీ మూడేళ్ల డేటాను అందించారు.
2019లో 1,39,123గా ఉన్న ఆత్మహత్యల సంఖ్య 2020లో 1,53,052కి, 2021లో 1,64,033కి పెరిగిందని, మూడేళ్ల కాలంలో ఆత్మహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతోందని NCRB డేటా వెల్లడించింది.
ఈ డేటా, ఈ మరణాలను తొమ్మిది కేటగిరీలుగా వర్గీకరించింది - గృహిణి, వృత్తిరీత్యా/జీతం పొందే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వ్యవసాయ రంగంలో ఉన్న వ్యక్తులు, రోజువారీ వేతన జీవులు, రిటైర్డ్ వ్యక్తులు, ఇతరులు.
మొత్తం ఆత్మహత్యల్లో రోజువారీ వేతన జీవుల ఆత్మహత్యలు దాదాపు 25% ఉన్నాయి..
ఆత్మహత్య చేసుకున్న రోజువారీ వేతన కూలీల సంఖ్య 2019లో 32,563 నుండి 2020లో 37,666కి పెరిగింది 2021లో 42,004కి పెరిగింది.
COVID-19 లాక్‌డౌన్‌లో, లక్షలాది మంది వలస వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులు హటాత్తుగా రాత్రికి రాత్రి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కాలినడకన వేలాది కిలోమీటర్లు నడిచి వారి గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
గృహిణుల ఆత్మహత్యల సంఖ్య కూడా ఈ మూడేళ్లలో క్రమంగా పెరిగి 2019లో 21,359 నుండి 2020లో 22,374కి 2021లో 23,179కి చేరుకుందని డేటా వెల్లడించింది.
ఆత్మహత్యలతో మరణించిన వ్యక్తులలో స్వయం ఉపాధితో జీవిస్తున్న వ్యక్తులు మూడవ స్థానం ఆక్రమించారు. వీరు, 2019లో 16,098 మంది ఆత్మహత్య చేసుకోగా. 2020లో 17,332 మంది , 2021లో 20,231 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కాలంలో ఆత్మహత్యల ద్వారా మరణించిన వారిలో నిరుద్యోగులు నాల్గవ అతిపెద్ద వర్గం. వారి మరణాల సంఖ్య 2019లో 14,019 నుండి 2020లో 15,652కి పెరిగింది, అయితే 2021లో 13,714కి స్వల్పంగా తగ్గింది.
ఆత్మహత్యల్లో విద్యార్థులు ఐదవ స్థానంలో ఉన్నారు. విద్యార్థులలో నమోదైన ఆత్మహత్యలు 2019లో 10,335 నుండి 2020లో 12,526కి దాదాపు 20% పెరిగాయి. ఇది 2021లో గరిష్టంగా 13,089కి చేరుకుంది.
వ్యవసాయ రంగంలో ఉన్నవారి విషయానికొస్తే, ఈ కాలంలో రైతులు, సాగుదారుల మరణాలు తగ్గుముఖం పట్టగా, వ్యవసాయ కూలీల మరణాలు పెరిగాయని NCRB డేటా వెల్లడించింది.
రైతులు, సాగుదారుల విషయానికొస్తే, ఆత్మహత్యల ద్వారా నమోదైన మరణాల సంఖ్య 2019లో 5,957 నుండి 2020లో 5,579కి మరియు 2021లో 5,318కి తగ్గింది. అయితే, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2019లో 4,324 నుంచి 2020లో 5,098కి, 2021లో 5,563కి పెరిగాయి.