తీరం దాటిన 'దానా' తుపాను
తీరం దాటే సమయంలో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు. గాలుల దాటికి కొన్నిచోట్ల నేలకూలిన చెట్లు. తుపాన్ ప్రభావంతో ఒడిషా, బెంగాల్‌లో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను తీరం దాటింది. ఒడిషాలోని బిత్తర్‌కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్ బలహీనపడనున్నది. తుపాను తీరం దాటే సమయంలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. గాలుల దాటికి కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి.
తుపాన్ ప్రభావంతో ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించాలని అధికారులు ఇరు రాష్ట్రాలకు సూచించారు. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం సాయంత్రం నుంచి ఇవాళ (శుక్రవారం) 9 గంటల వరకు మూసి ఉంచనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. అధికారులు తుపాను ప్రభావితమయ్యే ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు.