మౌనీ అమావాస్యకు కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ నిబంధనలు మీ కోసమే!
ఒక్కరోజే 10 కోట్ల మంది తరలివస్తారని అంచనా.. అడ్వైజరీ జారీ చేసిన యూపీ సర్కారు
మౌనీ అమావాస్య వేళ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్నారా.. మీకోసమే మహా కుంభమేళా నిర్వహణ కమిటీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. తమ అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తోన్న మహా కుంభమేళాకు ఇప్పటికే 15 కోట్ల మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఈనెల 13న మహాకుంభమేళా మొదలవగా ఆ రోజే కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారు. రెండోరోజు మకర సంక్రాంతి సందర్భంగా మూడున్నర కోట్ల మంది తరలివచ్చినట్టుగా అధికారులు అంచనా వేశారు. అత్యంత విశిష్టమైన మౌనీ అమావాస్య మంగళవారం రావడంతో ఈ ఒక్కరోజే ప్రయాగ్‌రాజ్‌కు కనీసం 10 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. అలాగే భక్తుల కోసం అడ్వైజరీ కూడా జారీ చేసింది. యూపీ సర్కారు అంచనాకు తగ్గట్టే మంగళవారం మౌనీ అమావాస్య వేళ పుణ్యస్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అడ్వైజరీలో ఏం చెప్పారంటే...
కుంభమేళాకు మౌనీ అమావాస్యకు వస్తోన్న భక్తులు నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలి. స్నానాల తర్వాత అక్కడ ఎక్కువ సేపు ఉండ్డొద్దు.. పార్కింగ్ ప్రదేశాలు, బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలి. బారికేడ్లు వద్ద, పాంటూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలి. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ హాస్పిటళ్లకు వెళ్లాలి. త్రివేణి సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవే. మొదట ఎక్కడికి చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం మంచిది. సోషల్ మీడియాలో ఇతర ప్రసార మాధ్యమాల్లో చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దు. రోడ్లమీద గుంపులుగా నిల్చోవద్దు. స్నానం చేసే ప్రదేశాలకు, ఆలయాల్లో దర్శనాలకు హడావిడిగా వెళ్లొద్దు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, అవసరమైనచోట పోలీసులు, అధికారుల సాయం తీసుకోవాలి. భక్తుల రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలి. భక్తులు తమ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.