విమర్శలు, వివాదాలు.. ఆదిపురుష్ పై మళ్లీ కోర్టులో కేసులు
శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ టీమ్ పై మండిపడ్డారు. ఆంజనేయుడికి పంచ్ డైలాగులు పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు
అది వాల్మీకి రామాయణం కాదు, ఓం రౌత్ రామాయణం అంటూ విడుదలైన తొలి రోజునుంచే ఆదిపురుష్ పై సెటైర్లు పేలిపోతున్న సందర్భంలో తాజాగా మళ్లీ సినిమాపై కోర్టు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీశారంటూ హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వాల్మీకి, తులసీదాస్ రచించిన రామాయణంలోని పాత్రలకు విరుద్ధంగా ఇందులోని పురాణ పాత్రలను అనుచితంగా తీర్చిదిద్దారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. బ్రాహ్మణుడైన రావణాసురుడికి గడ్డం పెట్టడమేంటని ప్రశ్నించారు. హిందూ నాగరికతను అవమానించారని, అలాంటి సన్నివేశాలు తొలగించాలని, లేదా ప్రదర్శన ఆపివేయాలని కోర్టుని కోరారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రాజకీయ విమర్శలు..
ఆదిపురుష్ విడుదలకు ముందు జై శ్రీరామ్ అంటూ హడావిడి చేసిన బీజేపీ నేతలు, సినిమా రిలీజయ్యాక మాత్రం సైలెంట్ అయ్యారు. ఇక ఈ సినిమా దర్శకుడిపై ఉద్ధవ్ సేన వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ టీమ్ పై మండిపడ్డారు. ఆంజనేయుడికి పంచ్ డైలాగులు పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి డైలాగులు రాసినందుకు సినిమా టీమ్ వెంటనే ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారామె. హనుమంతుడి డైలాగ్స్ విషయంలో ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. వినోదం పేరుతో దేవుళ్ల పాత్రధారులతో ఇలాంటి భాష పలికించడం భారతీయుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.
తొలిరోజు సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు రచ్చ చేశారు. కొన్నిచోట్ల థియేటర్లను ధ్వంసం చేశారు. మరికొంతమంది నెగెటివ్ రివ్యూ చెబుతున్నవారిపై దాడులు చేశారు, ఇంకొన్నిచోట్ల హనుమంతుడి సీటు విషయంలో గొడవ జరిగింది. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ ల సంగతి చెప్పక్కర్లేదు. సినిమా విడుదల రోజు ఆదిపురుష్ రివ్యూ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈరోజు ఆదిపురుష్ డిజాస్టర్ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. సలార్ అనే కొత్త సినిమాని ప్రభాస్ అభిమానులు హైలెట్ చేస్తున్నారు.