పట్టాలు తప్పిన రైలు.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు
ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
చండీగఢ్–డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఝులాహి రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాథక్ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో 4 ఏసీ బోగీలు ఉన్నాయి. పట్టాలు తప్పిన బోగీలన్నీ ఒక పక్కకు ఒరిగిపోయాయి. ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా దీనిపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 13 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.
కుట్ర కోణం ఉందా?
ఈ ప్రమాదంపై లోకో పైలట్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. రైలు పట్టాలు తప్పడానికి ముందు తాను భారీ పేలుడు విన్నానని ఆయన చెప్పారు. దీంతో ఈ ఘటన విషయంలో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని వారు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.50 లక్షలు చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.