జాత్యహంకార ధోరణి ఆమోద యోగ్యం కాదు.. - రిషి సునాక్
చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యానని చెప్పిన రిషి సునాక్.. తన తోబుట్టువులనుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశానని ఈ సందర్భంగా వివరించారు.
జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోద యోగ్యం కాదని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. చిన్నతనంలో తాను కూడా జాతి వివక్షకు గురయ్యానని ఆయన గుర్తుచేసుకున్నారు. తాజాగా ఒక మీడియా ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆ ఇంటర్వ్యూలో కీలక అంశాలు వెల్లడించారు.
ఆ వివక్ష ఎంతో బాధ కలిగించింది...
చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యానని చెప్పిన రిషి సునాక్.. తన తోబుట్టువులనుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశానని ఈ సందర్భంగా వివరించారు. ఆ వివక్ష ఎంతో బాధ కలిగించిందని ఈ సందర్భంగా ఆయన తన బాల్యాన్ని గుర్తుతెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని ఆయన తెలిపారు.
ఇంగ్లిష్ ఉచ్ఛరణలో ఎన్నో జాగ్రత్తలు..
తన భారతీయ వారసత్వం గురించి రిషి సునాక్ వివరిస్తూ.. ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తమ తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. తమ ఇంగ్లిష్ ఉచ్ఛరణలో యాస లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారన్నారు. తాము మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారని ఆయన వివరించారు. అలా.. సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను తాము సరిగ్గా అనుకరించగలిగేవాళ్లమన్నారు. ఆది చూసి తమ తల్లి చాలా సంతోషించారని ఆయన చెప్పారు.