అమెరికా సమాచారం చైనాకు?
చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్.
అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు నావికులు ఆ దేశ కీలకమైన సైనిక సమాచారాన్ని చైనాకు చేరవేశారు. యుద్ధ విన్యాసాలు, నౌకాదళ ఆపరేషన్స్ సహా కీలక సాంకేతిక సామగ్రికి సంబంధించిన సమాచారాన్ని వీరిద్దరూ చైనా ఏజెంట్లకు ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. డబ్బులకు అమ్ముడిపోయి ఈ ద్రోహానికి పాల్పడిన వీరిద్దరినీ అమెరికా అధికారులు అరెస్టు చేశారు.
అమెరికా నౌకాదళంలో కీలక స్థావరాల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు చైనాకు ముఖ్యమైన సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో జించావ్ వీ అనే 22 ఏళ్ల వ్యక్తి.. పసిఫిక్ మహాసముద్రంలోనే అమెరికాకున్న అతిపెద్ద నౌకాదళ స్థావరం శాన్ డియాగో కేంద్రంలో పనిచేస్తున్నాడు. విమాన వాహక నౌక USS ఎసెక్స్‌లో పనిచేస్తున్న జించావ్ వీ.. నౌక ఎక్కుతుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి నౌక గురించి సున్నితమైన సమాచారం తెలుసుకొనేందుకు అనుమతులున్నాయి. అతడిని 2022 ఫిబ్రవరిలో తొలిసారి చైనీస్ ఏజెంట్లు సంప్రదించారని అమెరికా అధికారులు తెలిపారు.
జించావ్ నుంచి నౌకకు చెందిన పలు ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలు, టెక్నికల్ మాన్యూవల్, బ్లూప్రింట్లు, ఆయుధ వ్యవస్థలు, నౌకపై నిలిపే విమానాలు, హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఏజెంట్లు తెప్పించుకున్నారు. మారిటైమ్ శిక్షణలో ఉన్న ఏజెంట్ సమాచారం కూడా చైనా గూఢచారులకు అతను అందజేసినట్లు తెలిసింది. చైనాలో జన్మించి అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న జించావ్ వీని 2022 ఫిబ్రవరిలో ఒక చైనీస్ ఇంటెలిజెన్స్ అధికారి సంప్రదించారని అమెరికా అధికారులు తెలిపారు.
మరో వ్యక్తి వెన్‌హెంగ్ ఝావో కాలిఫోర్నియాలో వెంచురా కౌంటీలో నౌకాదళ స్థావరంలో పనిచేస్తున్నాడు. ఇతనికి థామస్ ఝావో అనే మారుపేరుంది. అతన్ని 2021లో చైనా ఏజెంట్లు సంప్రదించారు.. 15 వేల డాలర్లు చెల్లించి జపాన్‌లోని ఒకినావాలో ఉన్న అమెరికా సైనిక స్థావరంలోని రాడార్ల చిత్రాలు, డయాగ్రామ్‌లు, బ్లూప్రింట్లు, అమెరికా నౌకాదళ విన్యాసాల ప్రణాళికలు, ఆపరేషనల్ ఆర్డర్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థల ఫొటోలు, వీడియోలు తెప్పించుకొన్నట్లు తేలింది. ఇతడి నేరం నిరూపితమైతే 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. గూఢచర్య ఆరోపణలపై వీరిద్దరిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. దీనిపై అమెరికా నౌకాదళాధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఏ సైనికుడైనా.. సెయిలరైనా డబ్బు కోసం దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఇస్తే.. దానిని ద్రోహంగానే చూస్తామని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే అరెస్టైన ఇద్దరికీ పరస్పర సంబంధం ఉందా అనే విషయం అధికారులు చెప్పలేదు. అయితే ఈ ఘటనపై వాషింగ్టన్‌లోని చైనా కార్యాలయం స్పందించింది. ఈ ఆరోపణలను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తోందని, ఇవి నిరాధారమైనవని పేర్కొంది. చైనాకు సంబంధించిన గూఢచర్యం కేసులను అమెరికా ప్రభుత్వం, మీడియా కావాలని పెద్దవిగా చూపుతాయని విమర్శించింది.