జాహ్నవి మృతి ఘటనపై క్షమాపణ కోరిన మేయర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల మరణం పట్ల పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు.
భారతీయ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల మరణం పట్ల పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై సియాటెల్ మేయర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు.
పెట్రోలింగ్ చేస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో జాహ్నవి కందుల అక్కడికక్కడే మరణించారు. అయితే ఓ పోలీస్ అధికారి ఆమె మరణాన్ని తేలిక చేస్తూ మాట్లాడటం, అతని బాడీ కామ్ కెమెరాలో రికార్డ్ అయింది. అది ఇటు ఇండియాలో, అటు అమెరికాలో వైరల్‌గా మారింది.
దీంతో పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన భారత సమాజానికి క్షమాపణ చెప్పారు. ఈ దురదృష్ట సంఘటన, అనుచిత వ్యాఖ్యలతో భారత సమాజం ఏకమైందని, నగర అధికారులు భారత కమ్యూనిటీకి, జాహ్నవి మరణానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని బ్రూస్ హారెల్ తెలిపారు. జాహ్నవి కందులు మరణంపై త్వరితగతిన న్యాయ విచారణ జరిపిస్తామని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే భారతదేశానికి హామీ ఇచ్చింది.
మరోవైపు, ఈ ఘటనపై డేనియల్ వివరణ ఇస్తూ ఉన్నతాధికారులకు రాసిన లేఖను కూడా సియాటిల్ పోలీసు అధికారుల విభాగం గిల్డ్ విడుదల చేసింది. లాయర్లను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్ ఇందులో వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలకు దిగుతారో గతంలో తాను ప్రత్యక్షంగా చూశానని, అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నానన్నారు. అంతేగానీ, భారతీయ విద్యార్థిని మరణాన్ని తక్కువచేసి, అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పారదర్శకంగా విచారణ జరగాలని, ఉన్నతాధికారులు తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని తెలిపారు.
మరోవైపు డేనియల్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్‌లైన్ పిటిషన్లు మొదలయ్యాయి.
♦