హెజ్‌బొల్లా కీలక నేత లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి
తాజాగా హెజ్‌బొల్లా కీలకనేతపై గురిపెట్టి డమాస్కస్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్
హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొన్నిరోజులుగా దాడులు చేస్తున్నది.ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ జరిపిన క్షిపణుల దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన ముఖ్యనేతలు హతమయ్యారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ లెబనాన్‌లో ఐడీఎఫ్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలపై పోరాటాన్ని కొనసాగిస్తానని హిజ్ బొల్లా డిప్యూటీ లీడర్ నయీమ్ ఖాస్సేమ్ టెలివిజన్ ప్రసంగంలో ప్రతిజ్ఞ చేశాడు. తాజాగా హెజ్‌బొల్లా కీలకనేతపై గురిపెట్టిన ఇజ్రాయెల్ డమాస్కస్‌పై దాడిచేసింది. ఆయుధాల రవాణాలో అతనిదే కీలక పాత్ర అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి సమీపంలోని నివాస ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని, వారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారని వెల్లడించింది.
దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. హెజ్‌బొల్లా వర్గాలు ఆ మార్గం గుండా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడులకు పాల్పడటానికి వాటిని ఏర్పాటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నది. వైమానిక దాడుల్లో 50 మంది హెజ్‌బొల్లా ఉగ్రవాదులను హతమార్చామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. వారిలో ఆరుగురు సీనియర్ కమాండర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధం ఆవిష్కరణ!
మరోవైపు సరికొత్త ఆయుధాన్ని ప్రదర్శిస్తామని ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ ప్రకటించింది. లైట్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. డ్రోన్లు, మోర్టార్లను ధ్వంస చేసే సామర్థ్యం దీనికి ఉన్నది. దీనిని ట్రోఫీ యాంటీ ట్యాంక్ వ్యవస్థకు అనుసంధానించే అవకాశం ఉన్నదని, వాషింగ్టన్ డీసీలో దీన్ని ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది.