IMF Report: 2.9 శాతానికి పడిపోనున్న ప్రపంచ ఆర్ధిక వృద్ధి, భారత్ మాత్రం కొంత బెటర్
''అక్టోబర్ తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం వృద్ధిని కలిగి ఉంది. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో (2023లో) 6.1 శాతానికి తగ్గుతుంది.”అని IMF చీఫ్ ఎకనామిస్ట్ విలేకరులతో అన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ మంగళవారం తెలిపింది. ఇది 2022 లో 3.4 శాతంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం ఉంటుందని, మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు వృద్ధి 6.8 శాతంగా ఉండి తదననంతరం 6.1 శాతానికి పడిపోతుందని IMF తెలిపింది.
IMF మంగళవారం తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ జనవరి రిపోర్టును విడుదల చేసింది.
“అక్టోబర్ తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం వృద్ధిని కలిగి ఉంది. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో (2023లో) 6.1 శాతానికి తగ్గుతుంది. ఇది చాలావరకు బాహ్య కారణాలవల్లనే జరుగుతుంది”అని IMF చీఫ్ ఎకనామిస్ట్, పరిశోధన విభాగం డైరెక్టర్ పియర్-ఒలివియర్ గౌరించాస్ వాషింగ్టన్ లో విలేకరులతో అన్నారు.
IMF నివేదిక ప్రకారం, ఆసియాలో వృద్ధి 2023లో 5.3 శాతం, 2024లో 5.2 శాతం ఉంటుందని అంచనా వేయబడింది.
"ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, చైనా, భారతదేశం రెండింటినీ కలిపి చూస్తే, అవి 2023లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటాను కలిగి ఉంటాయి. " అని పియర్-ఒలివియర్ గౌరించాస్ అన్నారు.