నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను అప్పగించండి!
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను కోరిన ప్రధాని నరేంద్రమోడీ
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ 20 సదస్సులో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అవుతున్నారు. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ కోరారు. వారితోపాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా భారత్‌కు రప్పించడానికి కేంద్రం యత్నిస్తున్నది.
తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోడీ మోసగించిన అంశం 2018లో సంచలనం సృష్టించింది. ఈ కేసునుసీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. 2018 డిసెంబర్‌లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలిపింది. దీంతో అతణ్ణి అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించడానికి ఈ ఏడాది బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది. తనను భారత్ అప్పగించే విషయాన్ని సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టి వేసింది.
మరోవైపు విజయ్ మాల్యా భారత్‌లో రూ. 9 వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశాడు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నది. ఆ తర్వాత అతను భారత్ వీడి పారిపోయినట్లు తెలిపింది. ఈ ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం మొదటి నుంచి పాజిటివ్‌గానే స్పందిస్తున్నది. అయితే వారిని అప్పగించడానికి అక్కడి ప్రభుత్వం ఆదేశించినా.. కొన్ని లీగల్ సమస్యలు ఎదురవడం వల్ల ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతున్నది.