పారిస్ ఒలింపిక్స్‌పై కుట్ర.. పుతిన్ హస్తముందా?
ఒలింపిక్స్‌కు రష్యాను ఆహ్వానించకపోవడంతో దాడుల వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు భద్రతా నిపుణులు.
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌పై కుట్ర జరిగింది. ఫ్రాన్స్‌లోని హైస్పీడ్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులకు దిగారు. దేశం నలుమూలలకూ అనుసంధానం చేసే కీలకమైన రైల్వే ట్రాకులే టార్గెట్‌గా దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము 5.30గంటల వరకు విధ్వంసం జరిగింది. కీలక ప్రాంతాల్లో రైల్వే ట్రాకులను ధ్వంసం చేశారు. రైల్వే నెట్‌వర్క్ వైర్లను కత్తిరించారు. సిగ్నల్ బాక్సులను ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టారు. దాడుల వల్ల రెండున్నర లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుండగులు కత్తిరించిన వైర్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి.
రైల్వే లైన్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పథకం ప్రకారం ఈ దాడులు జరిగాయని ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియెల్ అట్టల్ చెప్పారు. దాడులపై దర్యాప్తు కొనసాగుతోంది. వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదుల పనే అని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పర్యావరణ ఆందోళనకారుల పని కూడా కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒలింపిక్స్‌కు రష్యాను ఆహ్వానించకపోవడంతో దాడుల వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు భద్రతా నిపుణులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు జరిగిన ఈ దాడులు సంచలనంగా మారాయి.