చిరుతపై పోరాడి మాజీ క్రికెటర్‌ను కాపాడిన పెంపుడు కుక్క
స్థానికులు వెంటనే స్పందించి విట్టాల్‌ను, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఇక తీవ్ర గాయాలకు గురైన విట్టాల్‌కు శస్త్ర చికిత్స జరిగింది.
తన యజమానిపై చిరుత పులి దాడి చేసి.. చంపేందుకు ప్రయత్నించిన ఘటనలో పెంపుడు కుక్క వీరోచితంగా పోరాడి కాపాడిన ఉదంతం జింబాబ్వేలో చోటుచేసుకుంది. ఆ యజమాని ఎవరో కాదు జింబాబ్వే మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ గై విట్టాల్. 51 ఏళ్ల వయసులో ఉన్న విట్టాల్ ఇటీవల హ్యూమని ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం వెళ్లాడు. తన పెంపుడు కుక్క చికారాను కూడా వెంట తీసుకెళ్లాడు.
పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత పులి విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న చికారా వెంటనే తన యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆ క్రమంలో విట్టాల్‌తో పాటు అది కూడా తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో రక్తమోడుతున్నా లెక్కచేయక చిరుతతో పోరాడి తరిమికొట్టింది. ఈ ఘటనలో విట్టాల్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే స్పందించి విట్టాల్‌ను, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఇక తీవ్ర గాయాలకు గురైన విట్టాల్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అతని భార్య హన్నా స్టూక్స్ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ విషయాలను ఆమె షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. విట్టాల్‌కు గతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నట్టు హన్నా వెల్లడించింది. 2013లో విట్టాల్ ఇంట్లోకి పెద్ద మొసలి చొరబడి మంచం కిందకు వెళ్లిందని, ఆ విషయాన్ని ముందుగానే గమనించడంతో అతనికి ప్రాణాపాయం తప్పిందని ఆమె తెలిపింది. దీంతో ‘చికారా.. యూ ఆర్ అమేజింగ్..’ అంటూ పలువురు సోషల్‌మీడియాలో స్పందిస్తున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ చికారా, విట్టాల్‌ను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.