బ్లూటిక్ కి రేటు కట్టిన మస్క్..

ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.

Advertisement
Update:2022-10-31 10:18 IST

అనుకున్నంతా అయింది. ట్విట్టర్ అకౌంట్లకు రేటు కడుతున్నారు కొత్త యజమాని ఎలన్ మస్క్. మామూలోడు కాదు మస్క్, పక్కా బిజినెస్ మేన్. ట్విట్టర్ డీల్ పూర్తయిన వెంటనే ఉద్యోగుల మెడపై కత్తిపెట్టాడు. అంతమందిని తానేం చేసుకోవాలంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు బ్లూటిక్ కి రేటు కట్టి వెరిపైడ్ కస్టమర్లకు షాకిచ్చాడు.

నాక్కూడా ట్విట్టర్లో బ్లూటిక్ వచ్చిందోచ్.. అంటూ చాలామంది మురిసిపోయేవారు. అయితే ఆ మురిపెం ఎక్కువ రోజులు ఉండదు. ఇకపై కూడా బ్లూటిక్ ఉండాలంటే ముందుగా 1600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియంకు కాలపరిమితి ఉంటుందా.. లేదా..? అనేది ముందు ముందు తేల్చేస్తారు మస్క్. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఫేస్ బుక్, ఇన్ స్టాలతో పోటీ ఉన్నా కూడా.. రాజకీయ నేతలు, అధికారులు ట్విట్టర్ ని ఎక్కువగా ఫాలో అవుతుండటం, వారందరికీ ట్విట్టర్లో అధికారిక అకౌంట్లు ఉండటంతో.. కచ్చితమైన సమాచారం కోసం చాలామంది ట్విట్టర్ ని ఆశ్రయిస్తుంటారు. బ్లూటిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్ల నుంచి ట్వీట్ పడితే దానికి ఓ ప్రామాణికత ఉంటుంది. కానీ, ఇప్పుడు బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.

మరిన్ని మార్పులు..

ఇప్పటి వరకూ ఉచిత సేవగా ఉన్న ట్విట్టర్ ని బ్లూటిక్ కస్టమర్ల పేరుతో పెయిడ్ సర్వీస్ గా మార్చారు మస్క్. ఆమధ్య యూట్యూబ్ కూడా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పేరుతో ఇలాంటి ప్రయత్నం చేసినా, కస్టమర్ల నుంచి నిరసన రావడంతో దాన్ని విరమించుకుంది. ఇప్పుడు మస్క్ ప్రయత్నానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. నిరసనలు వచ్చినా, వ్యతిరేకత వచ్చినా మస్క్ వెనక్కితగ్గేరకం కాదు.

Tags:    
Advertisement

Similar News