అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని ఆపేయండి.. - ఎలాన్ మ‌స్క్ స‌హా 1000 మంది నిపుణుల బహిరంగ లేఖ‌

అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధిని వెంట‌నే నిలిపివేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణుల బృందం త‌మ లేఖ‌లో పేర్కొంది.

Advertisement
Update:2023-03-30 13:41 IST

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్ర‌పంచాన్ని మున్ముందు అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తుంద‌ని భావిస్తున్న టెక్నాల‌జీ ఇది. ఈ టెక్నాల‌జీ వ‌ల్ల భ‌విష్య‌త్తులో జ‌రిగే అభివృద్ధితో పాటు దీనివ‌ల్ల ప్ర‌మాదాలూ పొంచి ఉంటాయ‌నే అనుమానాలు అనేక‌మందిలో ఉన్నాయి. తాజాగా ఇదే విష‌యాన్ని ప‌లువురు నిపుణుల బృందం వెల్ల‌డించింది. అత్యాధునిక ప్ర‌యోగాల దిశ‌గా ఈ టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తున్న క్ర‌మంలో భ‌విష్య‌త్తులో ఇది మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా ప‌రిణ‌మించే ప్ర‌మాద‌ముంద‌ని ఆయా నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు 1000 మంది నిపుణులు త‌మ సంత‌కాల‌తో కూడిన బ‌హిరంగ లేఖ‌ను తాజాగా విడుద‌ల చేశారు. అందులో ట్విట్ట‌ర్ సీఈవో ఎలాన్ మ‌స్క్‌, యాపిల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ వోజ్నియాక్ కూడా ఉన్నారు.

అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధిని వెంట‌నే నిలిపివేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణుల బృందం త‌మ లేఖ‌లో పేర్కొంది. `పాజ్ జియాంట్ వేరియంట్ ఎక్స్‌పెరిమెంట్స్‌` పేరిట విడుద‌ల చేసిన ఈ లేఖ‌లో త‌మ అభ్యంత‌రాల‌ను వెల్ల‌డించింది. `ఫ్యూచ‌ర్ ఆఫ్ లైఫ్ ఇనిస్టిట్యూట్‌` త‌ర‌ఫున ఈ లేఖ‌ను విడుద‌ల చేసిన బృందంలో చాట్ జీపీటీని వ్య‌తిరేకిస్తున్న ప్ర‌ముఖుల‌తో పాటు ఓపెన్ ఏఐ ప్ర‌త్య‌ర్థి సంస్థ‌ల ప్ర‌తినిధులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఓపెన్ ఏఐకి తొలినాళ్ల‌లో మ‌స్క్ కూడా నిధులు స‌మ‌కూర్చారు. ఆయ‌న నేతృత్వంలోని టెస్లా కంపెనీ త‌మ విద్యుత్ కార్ల కోసం ప్ర‌త్యేక ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ధి చేస్తోంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్ చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవ‌ల జీపీటీ-4 పేరిట మ‌రింత అత్యాధునిక ఏఐ వ్య‌వ‌స్థ‌ను ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. మాన‌వ మేధ‌స్సుతో పోటీ ప‌డే జీపీటీ-4 వంటి ఏఐ వ్య‌వ‌స్థ‌లు స‌మాజానికి, యావ‌త్ మాన‌వాళికి తీవ్ర ముప్పును త‌ల‌పెట్టే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణుల బృందం ఇప్పుడు ఈ లేఖ‌లో పేర్కొంది. సానుకూల ఫ‌లితాలు ఇచ్చే ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను మాత్ర‌మే రూపొందించాల‌ని అందులో సూచించింది.

ఒక‌వేళ ఏవైనా వ్య‌తిరేక ప్ర‌భావాలు త‌లెత్తినా.. వాటిని నియంత్రించ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం కుదిరితేనే శ‌క్తిమంత‌మైన ఏఐల దిశ‌గా ముందుకెళ్లాల‌ని నిపుణులు త‌మ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. జీపీటీ-4 కంటే అత్యంత శ‌క్తిమంత‌మైన ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ధిని చేసే ప్ర‌య‌త్నాన్ని వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకొని ఆ దిశ‌గా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు.

Tags:    
Advertisement

Similar News