ఫిలిప్పీన్స్‌ దళాలపై చైనా బలగాల దాడులు – గల్వాన్‌ తరహాలో కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడి

ఫిలిప్పీన్స్‌ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌ గార్డ్‌ బలగాలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడికి తెగబడ్డాయి.

Advertisement
Update: 2024-06-20 16:11 GMT

ఫిలిప్పీన్స్‌ దళాలపై చైనా బలగాలు దాడులకు దిగాయి. భారత బలగాలపై గల్వాన్‌లో దాడులకు తెగబడిన తరహాలోనే ఈ దాడులు చేపట్టాయి. ఫిలిప్పీన్స్‌ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌ గార్డ్‌ బలగాలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడికి తెగబడ్డాయి. పడవలను ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటన వేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అక్కడే ఉన్న నేవిగేషన్‌ పరికరాలను కూడా సీజ్‌ చేశారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్‌ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్‌ థామస్‌ షోలకు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్టు వెల్లడించారు.

ఫిలిప్పీన్స్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రోమియో బ్రన్నెర్‌ జూనియర్‌ ఒక ప్రెస్‌మీట్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ.. చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు. చైనా కోస్ట్‌ గార్డ్‌ వద్ద పదునైన ఆయుధాలు ఉన్నాయని, తమ సైనికులు ఒట్టిచేతులతో పోరాడారని ఆయన చెప్పారు. తమ ఆయుధాలు, పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని, తమకు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. యుద్ధాలను నివారించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఫిలిప్పీన్స్‌ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను చైనా కోస్ట్‌ గార్డ్‌ దళాలు అడ్డుకున్నాయని తెలిపింది. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కోస్ట్‌ గార్డ్‌ చట్టంలో సరికొత్త నిబంధనను చైనా గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్‌ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి తెగబడినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News