దాగుడు మూతలు ఆడుకుంటూ మాయమై.. వేరే దేశంలో ప్రత్యక్షమైన బాలుడు

బాలుడిని క్షేమంగా, అధికార మార్గాల ద్వారా బంగ్లాదేశ్ పంపడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మలేషియా హోం మంత్రి సఫీయుద్దీన్ ఇస్మాయేల్ చెప్పారు.

Advertisement
Update:2023-01-30 09:49 IST

చిన్న పిల్లలు దాగుడు మూతలు (హైడ్ అండ్ సీక్) ఆడుకుంటూ ఒక్కోసారి కనపడకుండా పోతుంటారు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు ఇలా ఎక్కడో దాక్కొని నిద్రపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడుతుంటారు. ఇక్కడ ఓ బాలుడు కూడా దాగుడు మూతలు ఆడుకుంటూ మాయమై పోయాడు. ఎక్కడో దాక్కొని ఉంటాడని భావిస్తే.. చివరకు వేరే దేశంలో ప్రత్యక్షం అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌కు చెందిన ఓ 15 ఏళ్ల కుర్రాడు పోర్టు సమీపంలో నివశిస్తుంటాడు. తోటి స్నేహితులతో దాగుడు మూతలు ఆడుకుంటూ పోర్టులోని ఒక కంటైనర్‌లో దాక్కున్నాడు. అక్కడే నిద్రరావడంతో పడుకున్నాడు. అయితే పోర్టు సిబ్బంది ఇవేమీ గమనించకుండా కంటైనర్ డోర్ మూసేసి షిప్‌లోకి ఎక్కించారు. చిట్టాగాంగ్ నుంచి బయలు దేరిన షిప్ ఆరు రోజుల తర్వాత మలేషియాలోని వెస్ట్ పోర్ట్‌కు చేరుకున్నది. అక్కడ కంటైనర్ లోపల నుంచి ఎవరో అరుస్తూ, కొడుతున్నట్లు శబ్దం రావడంతో తలుపు తెరిచి చూశారు. లోపల బాలుడు అన్నం, నీళ్లు లేక నీరసించి కనిపించాడు.

బాలుడిని ఎవరైనా అక్రమంగా తరలించారేమో అని మలేషియా అధికారులు భావించారు. వారం రోజులుగా తిండి, నీళ్లు లేకపోవడంతో పిచ్చిగా ప్రవర్తించడం, దిక్కులు చూస్తుండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాలేదు. అయితే పేరు మాత్రం ఫాహిమ్ అని చెప్పాడు. మొదట ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అనుకున్నారు. కానీ స్థానిక పోలీసులు పూర్తిగా విచారించగా.. బాలుడు తప్పిపోయి మలేషియా వచ్చినట్లు స్పష్టమైంది.

బాలుడిని క్షేమంగా, అధికార మార్గాల ద్వారా బంగ్లాదేశ్ పంపడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మలేషియా హోం మంత్రి సఫీయుద్దీన్ ఇస్మాయేల్ చెప్పారు. బాలుడు పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని, బంగ్లాదేశ్ అధికార వర్గాలతో చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలుడు నీరసంగా, జ్వరంతో బాధపడుతున్నాడని.. అవసరమైన చికిత్స చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News