జపాన్ భూకంపం.. 48కి చేరిన మృతులు
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్ల దృశ్యాలు కనిపించాయి.
కొత్త సంవత్సరం రోజు జపాన్‌ను అల్లాడించిన భారీ భూకంపంతో మరణించినవారి సంఖ్య 48కి చేరింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సెంట్రల్ జపాన్ లోని పలు ప్రావిన్స్ లలో ఏకధాటిగా కొనసాగిన 155 భూకంపాల ధాటికి ప్రజలు వణికిపోయారు. ఇవాళ కూడా ఇషికావాలో మరోసారి 4.9 తీవ్రతతో భూకంపం వచ్చినట్టుగా సమాచారం.
భూకంపం ధాటికి చాలా భవనాలు ధ్వంసమయ్యాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 43 వేలకు పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. మరోవైపు వరుస ప్రకంపనల నేపథ్యంలో జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఈరోజు ఉపసంహరించారు. కానీ, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే భూకంపంలో అణు విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్ల దృశ్యాలు కనిపించాయి. రోడ్లు బ్లాక్ చేయడం వల్ల సహాయ సిబ్బంది భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. రాబోయే వారం వరకు 7 తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించిన ప్రభుత్వం ప్రతి ఒక్కర్ని కాపాడుకోవాలని, విధ్వంసం వల్ల జరిగిన నష్టం పరిస్థితి గురించి ఆలోచించాలని వెల్లడించారు.
మరోవైపు.. జపాన్‌లో సంభవించిన భూకంపం ప్రభావం దక్షిణ కొరియాను కూడా తాకిందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా తీర ప్రాంతాల్లో పలు చోట్ల సునామీ అలలను గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.