వయసు తగ్గించే ప్రయోగాలు.. తనపైనే చేసుకుంటున్న మిలియనీర్.. - ఏడాదికి రూ.16.29 కోట్ల వ్యయం
వాస్తవంగా గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను జాన్సన్ తనపైనే చేయించుకునేందుకు ముందుకొచ్చాడు. అందుకోసం కాలిఫోర్నియాలోని వెనిస్‌లో గల తన నివాసాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాడు.
రివర్స్ ఏజింగ్.. అంటే వయస్సు వెనక్కి తీసుకెళ్లడం.. ఇది సాధ్యమేనా అనే విషయం పక్కన పెడితే వైద్య సాంకేతిక విధానాల ద్వారా దీనిని సుసాధ్యం చేసేందుకు అనేక ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. అయితే.. ఏకంగా ఈ ప్రయోగాలు తనపైనే చేయించుకుంటున్నాడు ఓ మిలియనీర్. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఒకవేళ ఈ ప్రయోగాలు వికటించి తన ప్రాణాలకు ముప్పు వచ్చినా పర్వాలేదని.. ఒకవేళ సక్సెస్ అయితే.. నవ యవ్వనంగా కనిపించాలనే మనిషి కోరిక నెరవేరేందుకు మార్గం ఏర్పడుతుందని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరతను.. ఏమా కథ.. తెలుసుకుందాం..
అతను ఓ సాఫ్ట్‌వేర్ మిలియనీర్.. బయోటెక్ మేధావిగా యూఎస్‌లో అతనికంటూ ఓ పేరుంది. అతని పేరు బ్రయాన్ జాన్సన్. వయస్సు 45 సంవత్సరాలు. మిలియనీర్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఇతను ప్రత్యేకంగా వార్తల్లోకెక్కడానికి కారణం.. రివర్స్ ఏజింగ్ ప్రక్రియ చేపట్టడమే. ఒలీవర్ జోల్మాన్ అనే 29 ఏళ్ల ఫిజీషియన్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. వృద్ధాప్యం, దీర్ఘాయువు అనే అంశాలపై వీరిద్దరికీ ఆసక్తి ఎక్కువే కావడం విశేషం. నిత్యం 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు జాన్సన్ శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట.
వాస్తవంగా గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను జాన్సన్ తనపైనే చేయించుకునేందుకు ముందుకొచ్చాడు. అందుకోసం కాలిఫోర్నియాలోని వెనిస్‌లో గల తన నివాసాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాడు. అధికారికంగా యాంటీ ఏజింగ్ కోసం అతను చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా.. గత ఏడాది కాలంలో 2 మిలియన్ డాలర్లు. మన భారత కరెన్సీలో అది 16 కోట్ల 29 లక్షల 68 వేల 990 రూపాయలు కావడం విశేషం.
ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా తన శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని.. గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా.. చర్మం 28 ఏళ్ల వ్యక్తికి ఉండేలా కనిపించేందుకు జాన్సన్ ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు రెగ్యులర్‌గా చేయాల్సిన వ్యాయామం, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ కూడా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. ఈ ఏడాదిలో బ్రెయిన్, లంగ్స్, కిడ్నీలు, లివర్, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటినీ 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడతను. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ తన కథనం ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.